హసన్‌పర్తి, వెలుగు: దక్షిణాఫ్రికాలో జరిగిన విమాన ప్రమాదంలో హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన ట్రైనీ పైలెట్ సుమంత్ మృతిచెందాడు. శిక్షణ సమయంలో విమానం నేల కూలినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన ఆడెపు వరలక్ష్మి, చంద్రమోహన్ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఈ కుటుంబం ప్రస్తుతం హసన్‌పర్తి మండల కేంద్రంలో స్థిరపడింది. వారి చిన్న కొడుకు ఆడెపు సుమంత్ (22) ఇంటర్ వరకు హనుమకొండలోనే చదివాడు.
ఏవియేషన్ రంగంపై ఆసక్తితో గతేడాది పైలెట్ ట్రైనింగ్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లాడు. సుమంత్ శనివారం సాయంత్రం విమానం నడుపుతుండగా అదుపుతప్పి నేలకూలింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరణవార్త వినగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హసన్‌పర్తి, సీతంపేటల్లో విషాదచాయలు అలుముకున్నాయి. సుమన్ మృతి పట్ల వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఫోన్ చేసి కుటుంబసభ్యులను పరామర్శించారు.
