ఉద్దేశపూర్వకంగానే దాడి.. నిర్లక్ష్యంతో కాదు

ఉద్దేశపూర్వకంగానే దాడి.. నిర్లక్ష్యంతో కాదు

న్యూఢిల్లీ: ఉత్తర్​ప్రదేశ్ లఖీంపూర్ ఖేరి రైతులపై దాడి ఘటన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రైతుల పైకి కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనంతో దూసుకెళ్లిన ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ) స్పష్టం చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగిందని.. నిర్లక్ష్యంతో కాదని సిట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిందితులపై హత్యాయత్నం అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతించాలని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ను సిట్ కోరింది.  

కాగా, లఖీంపూర్ కేసులో ప్రస్తుతం నిందితులపై సెక్షన్ 279, 338, 304ఏ కింద నిర్లక్ష్యంగా నేరానికి పాల్పడిన అభియోగాలు ఉన్నాయి. వాటి స్థానంలో సెక్షన్ 307(హత్యాయత్నం), సెక్షన్ 326(ప్రమాదకరమైన ఆయుధాలతో ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), సెక్షన్ 34ను చేర్చాలని మేజిస్ట్రేట్​ ను సిట్ అధికారులు కోరారు. ఇకపోతే, సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ కుమారుడు ఆశిష్ కు చెందిన కారు దూసుకెళ్లిన ఘటనలో 5 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయాలపాలయ్యారు.