బడా నాయకులొస్తున్నారు? .. మెదక్​, నర్సాపూర్‌‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభలు

బడా నాయకులొస్తున్నారు? ..  మెదక్​, నర్సాపూర్‌‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్  సభలు

మెదక్​, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రచారాలకు  ఇంకా 13 రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ఉదృతం చేస్తున్నారు. జిల్లాలోని మెదక్​, నర్సాపూర్​ అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో పోటీలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు గ్రామాల్లో పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో  తమకున్న ప్రజాబలాన్ని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అగ్రనేతల బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్​ చేశారు. 

కాంగ్రెస్ సభలు

కాంగ్రెస్​ కొద్ది రోజుల కిందట మెదక్​పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్​లో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్​ నిర్వహించే సీఎం కేసీఆర్​ ప్రచార సభలకు ధీటుగా కాంగ్రెస్​ ప్రచార బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తోంది. నాలుగైదు రోజుల్లో నర్సాపూర్ లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఆ పార్టీ  నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తరువాత మెదక్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా జిల్లాలోని మెదక్​, నర్సాపూర్​ సెగ్మెంట్లలో బీజేపీ అగ్రనేతల మీటింగ్​లకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. 

రెండు చోట్ల ముఖ్యమంత్రి సభలు

అధికార బీఆర్ఎస్ మెదక్​, నర్సాపూర్​ రెండు చోట్ల పార్టీ అధినేత, సీఎం కేసీఆర్​ బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ఈనెల 15న మెదక్​ పట్టణంలో, 16న నర్సాపూర్​ పట్టణంలో జరిగే బీఆర్ఎస్​ బహిరంగ సభల్లో కేసీఆర్​పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ  కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తరువాత ఐదారు రోజుల్లో మెదక్ లో బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు ప్లాన్ చేస్తున్నారు.