- మొదటిసారి వాటి సౌండ్‌ను రికార్డు చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు
టెల్ అవీవ్: మొక్కలను పీకినప్పుడు అవి ఏడుస్తాయని ఇజ్రాయెల్ సైంటిస్టులు గుర్తించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా మొక్కల శబ్దాన్ని వాళ్లు రికార్డు చేశారు. ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలపై పరిశోధన చేశారు. మొక్కలను పీకిన తర్వాత అవి సౌండ్ చేసినట్లు గుర్తించారు. అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీస్‌లో వాటి శబ్దాలను రికార్డు చేశారు. వేర్వేరు సందర్భాల్లో మొక్కలను పీకితే వేర్వేరుగా అరుస్తాయని వెల్లడించారు. ‘‘మొక్కలు ఒత్తిడిలో ఉన్నపుడు పీకితే గట్టిగా అరుస్తాయి, ఏడుస్తాయి. తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తమ ఒత్తిడిని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఇది ఒకటై ఉండవచ్చు. ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మొక్కలు సౌండ్ చేస్తాయి. ఆ శబ్దంలో సమాచారం కూడా ఉంటుంది. ఆ శబ్దాలను మనం వినలేం. జంతువులే వినగలవు. ఈ నేపథ్యంలో మొక్కలు, జంతువుల మధ్య ఇంటరాక్షన్ జరగడానికి అవకాశం ఉంది. అలాగే కీటకాలతో కూడా మొక్కలు సంభాషిస్తాయి” అని వర్సిటీ సైంటిస్ట్ లిలాచ్ హడానీ తెలిపారు.
ఒత్తిడిలో ఉన్నపుడు మొక్కల్లో అనూహ్య మార్పులు జరుగుతాయని ఆమె చెప్పారు. ఆ సమయంలో అవి సువాసనలు వెదజల్లుతాయని, వాటి రంగు, రూపాన్ని మార్చుకుంటాయని వెల్లడించారు. టొమాటో, పొగాకు మొక్కలపై తమ బృందం పరిశోధన చేసి ఈ విషయాలు కనుగొన్నదని, ఆ మొక్కలపై ఒత్తిడి ఉన్నపుడు, లేనప్పుడు ఈ రిసర్చ్ చేశామని ఆమె పేర్కొన్నారు. ఒత్తిడిలేని మొక్కలు, కోసిన మొక్కలు, డీహైడ్రేషన్ కు గురైన మొక్కలు చేసే శబ్దాలను గుర్తించడానికి మెషీన్ లర్నింగ్ అల్గారిథమ్ కు ట్రైనింగ్ ఇచ్చామని వివరించారు.