
న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్.. ఫ్లాట్జ్‌మన్ ఓపెన్ చాలెంజర్ టోర్నీలో నిరాశపర్చాడు. జర్మనీలోని హాగెన్‌లో శనివారం మెన్స్ ప్రిక్వార్టర్స్‌లో నగాల్ 2–6, 6–4, 4–6తో జూనియర్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ నీల్స్ మెక్‌డొనాల్డ్ (జర్మనీ) చేతిలో ఓడాడు. వర్షం వల్ల రెండు రోజుల పాటు 2 గంటల 16 నిమిషాలు సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోయాడు.
తొలి రెండు సెట్లలో చెరోటి గెలిచిన తర్వాత వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. రెండో రోజు తిరిగి కొనసాగించగా, మూడో సెట్‌లో నగాల్ నిరాశపర్చాడు. మ్యాచ్ మొత్తంలో మెక్‌డొనాల్డ్ 9 బ్రేక్ పాయింట్లలో ఆరింటిని కాచుకున్నాడు. నగాల్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మెక్‌డొనాల్డ్ 90 పాయింట్లు నెగ్గగా, నగాల్ 83తోనే సరిపెట్టుకున్నాడు. నగాల్‌కు 1535 యూరోలతో పాటు ఆరు ర్యాంకింగ్ పాయింట్లు వచ్చాయి. మరోవైపు అమెరికాలో జరుగుతున్న లెక్సింగ్టన్ ఓపెన్‌లో దక్షిణేశ్వర్ సురేశ్ 6–7 (4), 4–6తో ఎలియట్ స్పిజిర్రి (అమెరికా) చేతిలో ఓడాడు. ఇటీవలే దక్షిణేశ్వర్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఇండియా డేవిస్ కప్ టీమ్‌లోకి తీసుకున్నారు. కజకిస్తాన్‌లో జరుగుతున్న ప్రెసిడెంట్స్ కప్‌లో కరణ్ సింగ్ క్వార్టర్‌ఫైనల్లో 4–6, 4–6తో అలెగ్జాండ్రా బిండా (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు.