పారిస్: టోర్నమెంట్ ఆదాయంలో ఆటగాళ్లకు ఇచ్చే వాటా తగ్గుతోందని పేర్కొంటూ జాన్నిక్ సిన్నర్, అరినా సబలెంకా, కోకో గాఫ్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రాండ్స్లామ్నిర్వాహకులతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ప్రైజ్ మనీ స్థాయిపై వారు తమ నిరసన తెలిపారు. పశ్చిమ పారిస్‌లో ఈ నెలాఖరున క్లే-కోర్ట్ గ్రాండ్ స్లామ్ ప్రారంభం కానుంది.
ప్రైజ్ మనీతో పాటు సరైన ప్రాతినిధ్యం, ఆరోగ్యం, పెన్షన్ వంటి అంశాలపై తాము చేసిన డిమాండ్లను అధికారులు పట్టించుకోవడం లేదని ఆటగాళ్లు ఆరోపించారు. గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రైజ్ మనీని 10 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. మొత్తం ప్రైజ్ మనీని 6.17 కోట్ల యూరోలుగా (సుమారు 7.21 కోట్ల డాలర్లు) నిర్ణయించారు.
ఇది గతేడాదితో పోలిస్తే రూ. 53 లక్షల యూరోలు ఎక్కువ. " టోర్నమెంట్ ఆదాయంలో ఆటగాళ్ల వాటా 2024లో 15.5 శాతంగా ఉండగా.. 2026 నాటికి అది 14.9 శాతానికి తగ్గుతుందని అంచనా" అని క్రీడాకారుల బృందం సోమవారం వెల్లడించింది.
