ఆటోమేటిక్ డిస్​క్వాలిఫికేషన్​పై  సుప్రీంలో పిటిషన్

ఆటోమేటిక్ డిస్​క్వాలిఫికేషన్​పై  సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ: రెండు లేదా అంతకంటే ఎక్కువ ఏండ్లు జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులను ఆటోమేటిక్ గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ ఫైల్ అయింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తెల్లారే ఈ పిటిషన్ దాఖలైంది. దీన్ని కేరళకు చెందిన సామాజిక కార్యకర్త  ఆభా మురళీధరన్​ లాయర్ దీపక్ ప్రకాశ్ ద్వారా వేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఈసీ, రాజ్యసభ, లోక్ సభ సెక్రటేరియట్​లను ప్రతివాదులుగా చేర్చారు. ‘‘ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) కింద ప్రజాప్రతినిధులను ఆటోమేటిక్​గా డిస్​క్వాలిఫై చేయడమంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమే. శిక్ష పడిన ప్రజాప్రతినిధిపై ఉన్న నేరం, దాని తీవ్రతతో సంబంధంలేకుండా అనర్హత వేటు వేస్తున్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం” అని పిటిషన్ లో పేర్కొన్నారు. 

నేర తీవ్రత ఆధారంగా డిస్ క్వాలిఫై చేయాలి.. 

‘‘ఒకవేళ దోషిగా తేలిన సభ్యుడు అప్పీల్ కు వెళ్లినప్పుడు కింది కోర్టు తీర్పును పైకోర్టు కొట్టేస్తే.. అతనిపై అనర్హత వేయడం కరెక్టు కాదు కదా?. ఆటోమేటిక్ గా డిస్ క్వాలిఫై చేస్తే ఆ సభ్యుడు తన విలువైన సమయాన్ని కోల్పోతాడు. అందుకే ఆటోమేటిక్ డిస్ క్వాలిఫికేషన్ పై తగిన ఉత్తర్వులు ఇవ్వండి” అని పిటిషన్ లో కోరారు. రాహుల్ విషయంలో నేరం, దాని తీవ్రత, అప్పీల్ కు వెళ్లే అవకాశం.. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుతమున్న రూల్స్ ప్రకారం గుడ్డిగా అనర్హత వేటు వేశారని పేర్కొన్నారు. 1951 చట్టంలోని సెక్షన్ 8(3) ప్రకారం కాకుండా.. సీఆర్ పీసీలో పేర్కొన్న నేర తీవ్రతల ఆధారంగా చట్ట సభ సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరారు.