-
రాష్ట్ర సర్కారుకు అధికారుల విజ్ఞప్తి
-
60 మంది కావాలని ప్రపోజల్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అనుమతులు ఇవ్వడంలో కీలకమైన రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ)కి సిబ్బంది కరువయ్యారు.ప్రస్తుతం రెరాలో సిబ్బంది 10 మందిలోపే ఉన్నారని, మొత్తం 60 మందిని కేటాయించాలని సర్కారుకు అధికారులు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది.
రెరాకు చైర్మన్ తోపాటు ముగ్గురు మెంబర్లను, సెక్రటరీని గత ప్రభుత్వం నియమించింది. సంస్థలో ఫైనాన్స్, టెక్నికల్, లీగల్, టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఉన్నా.. సరిపడా ఉద్యోగులు, అధికారులు లేరు. దీంతో రెరా కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో డేటా ఎంట్రీ, టెక్నికల్, ఐటీ, అడ్మినిస్ట్రేషన్ వంటి అవసరాల కోసం సిబ్బంది అవసరమని తెలియజేస్తూ పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందచేసినట్లు అధికారులు చెప్తున్నారు. కాగా, హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రెరా అనుమతులు ఇస్తుంది.
బిల్డర్లు ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే ముందుగా 18 రకాల పర్మిషన్లు తీసుకుని, ఆ తర్వాత రెరాకు తుది అనుమతి కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెరా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు 8,843 ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వగా.. 3,797 మంది బిల్డర్లు ప్రాజెక్టులను నమోదు చేసుకున్నారు.
అయితే, కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకొని ఇన్ టైమ్ లో ప్లాట్లు హ్యాండోవర్ చేయకున్నా, అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించినా రెరాకు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఫిర్యాదుల పరిష్కారం కోసం మాసాబ్ ట్యాంక్ లోని రెరా ఆఫీసులోనే వారానికి రెండు సార్లు కోర్టు విచారణ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 2,074 ఫిర్యాదులు రాగా, 1,192 ఫిర్యాదులను పరిష్కరించారు. రూల్స్ ఉల్లంఘించిన బిల్డర్లకు ఫైన్ వేసి, ఆ మొత్తాన్ని బాధితులకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెరా ఏర్పాటు అయిన తర్వాత నుంచి బిల్డర్ల మోసాలు తగ్గాయని అధికారులు చెప్తున్నారు.
