- గుజరాత్ లో ‘సోమనాథ్స్వాభిమాన్ పర్వ్’లో పాల్గొన్న ప్రధాని
- సోమనాథ్ వెయ్యేండ్ల చరిత్ర విజయానికి ప్రతీక అని వెల్లడి
- ఈ చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ఫైర్
- సోమనాథ్ టెంపుల్ రక్షణలో అసువులు బాసిన వీరులకు నివాళి
సోమనాథ్ (గుజరాత్): సోమనాథ్ ఆలయ వెయ్యేళ్ల చరిత్ర వినాశనం లేదా ఓటమి గురించి కాదని, అది విజయం, పునర్నిర్మాణానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు నేటికీ మన మధ్యే చురుగ్గా ఉన్నాయని, వారిని ఓడించడానికి దేశం అప్రమత్తంగా, ఐక్యంగా, బలంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని మండిపడ్డారు. బానిస మనస్తత్వంతో, బుజ్జగింపు రాజకీయాలకోసం దాని ప్రాముఖ్యతను విస్మరించారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. మూడు రోజుల గుజరాత్ పర్యటన సందర్భంగా ఆదివారం సోమనాథ్ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించి.. పూజలు చేశారు.
అనంతరం సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సభలో ప్రసంగించారు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న చారిత్రక సోమనాథ్ ఆలయంపై గతంలో జరిగిన దాడులను, ప్రతిసారీ ఆ ఆలయం తిరిగి ఎలా నిర్మించబడిందో ప్రధాని గుర్తు చేసుకున్నారు. ‘కత్తి పట్టుకొని ఎవరి హృదయాలను గెలవలేరు’ అని వ్యాఖ్యానించారు. క్రీ.శ. 1026లో మహ్మద్ గజనీ దాడి నుంచి మొదలుకొని విదేశీ ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని పదేపదే ధ్వంసం చేశారని గుర్తు చేశారు వెయ్యేండ్ల తర్వాత కూడా ఆలయంపై జెండా రెపరెపలాడుతూనే ఉన్నదని, అది దేశ స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతున్నదని తెలిపారు. ఈ ఆలయం.. ధైర్యం, త్యాగాలు, దృఢ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్.. భారతదేశ విశ్వాసానికి ప్రతిబింబమని, ఇందులో పాల్గొనడం ఒక గొప్ప జ్ఞాపకమని అన్నారు.
చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారు..
సోమనాథ్ ఆలయంపై దాడులు మత విద్వేషంతో జరిగినవే అయినప్పటికీ, వాటిని కేవలం సాధారణ దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేవలం సంపద కోసమే దాడులు జరిగితే, వెయ్యేళ్ల క్రితం మొదటి దోపిడీతోనే అవి ఆగిపోయేవి. కానీ దైవ విగ్రహాలను అపవిత్రం చేశారు, ఆలయ రూపాన్ని మార్చాలని ప్రయత్నించారు. ఆటవిక చరిత్రను దాచిపెట్టి మనకు తప్పుడు పాఠాలు చెప్పారు” అని వ్యాఖ్యానించారు. నిజమైన మత భక్తులు ఎవరూ ఉగ్రవాద భావజాలాన్ని సమర్థించరని, అయితే కొందరు వ్యక్తులు బుజ్జగింపు రాజకీయాల కోసం అప్పట్లో అలాంటి మతపరమైన తీవ్రవాదానికి తలొగ్గారని కాంగ్రెస్‌పై మోదీ పరోక్షంగా విమర్శలు చేశారు.
పునర్నిర్మాణానికి అడ్డంకులు సృష్టించారు..
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పించినప్పుడు ఆయన మార్గంలో అడ్డంకులు సృష్టించారని ప్రధాని మోదీ తెలిపారు. 1951లో ఆలయ ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వస్తున్నప్పుడు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఆ శక్తులు ఇప్పుడు కత్తులకు బదులుగా కుట్రల ద్వారా దేశాన్ని విడదీయాలని చూస్తున్నాయని, అందుకే ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ఔరంగజేబులాంటి ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని మసీదుగా మార్చాలని చూసినా, అహల్యాబాయి హోల్కర్‌లాంటి భక్తులు దీనిని పునర్నిర్మించారని ప్రధాని చెప్పారు. ‘‘ఇతరులను నాశనం చేసి ఎదగాలనుకునే నాగరికతలు అంతిమంగా తమను తాము నాశనం చేసుకుంటాయి. సృష్టి మార్గం కష్టతరమైనది.. కానీ శాశ్వతమైనదని సోమనాథ్ నేర్పుతుంది” అని తెలిపారు. వీర్ హమీర్జీ గోహిల్, వెగ్దాజీ భీల్‌లాంటి వీరులు సోమనాథ్ రక్షణలో ప్రాణత్యాగం చేశారని, అయితే గతంలో చరిత్రకారులు, రాజకీయ నాయకులు వారి త్యాగాలను విస్మరించి, దాడుల చరిత్రను కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ప్రధాని ఆరోపించారు.
రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు
గుజరాత్‌లోని సౌరాష్ట్ర–-కచ్ ప్రాంత పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా రాజ్‌కోట్‌లో ‘వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు’ (వీజీఆర్‌సీ) ఘనంగా షురూ అయింది. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌కోట్‌లోని మార్వాడీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారీ ట్రేడ్ షోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగబోతున్నదని తెలిపారు. కేవలం మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోదని, పరిశ్రమలకు తగిన విధంగా నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
స్వాభిమాన్ పర్వ్ సభకు ముందు ప్రధాని మోదీ ‘శౌర్య యాత్ర’ను ప్రారంభించారు. 108 గుర్రాలతో యాత్ర నిర్వహించారు. సోమనాథ్ రక్షణలో అసువులు బాసిన వీరులకు నివాళిగా యాత్ర సాగింది. శంఖ్ సర్కిల్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ సర్కిల్ వరకు కిలోమీటరు మేర సాగిన ఈ యాత్రలో మోదీ ప్రత్యేక వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆయన వెంట ఉన్నారు. మార్గమధ్యం లో పూజారి వద్ద ఉన్న డమరుకాన్ని తీసుకుని వాయిస్తూ ప్రధాని ప్రజలను ఉత్సాహపరిచారు. అంతకుముందు సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ.. సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు.
