
రాష్ట్రంలోని 7.60 లక్షల ఖాతాల్లో 152 కోట్ల నగదు బదిలీ
వెలుగు: చిన్న, సన్నకారు రైతులకోసం చేపట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి రెండో విడత సొమ్ము బుధవారం రైతుల ఖాతాల్లో జమకానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 7లక్షల 60వేల మంది రైతుల ఖాతాల్లో రూ.152 కోట్ల నగదు బదిలీ అవుతుందని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి వెల్లడించారు. రాష్ట్రంలో 5ఎకరాలలోపు ఉన్న రైతుల గుర్తింపు ప్రక్రియ 78శాతం పూర్తయింది. ఇప్పటి వరకు 20లక్షల35వేల మంది రైతుల వివరాలు పీఎం-కిసాన్ పోర్టల్ లో అప్ లోడ్ అయ్యాయి. తొలి విడత రాష్ట్రంలోని 5లక్షల 90వేల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.2000 ఖాతాల్లో జమ అయ్యాయి. రూ.118 కోట్ల 20లక్షల నగదు బదిలీ జరిగింది. తాజాగా రెండో దశ కూడా ప్రారంభించిన నేపథ్యంలో బుధవారం మొదటి విడత కంటే రెండో విడత పెట్టుబడే ముందు అందే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే రెండో విడత కూడా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రెండు విడతలు సమాంతరంగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ నగదు బదిలీ చేస్తోంది. ఈ నెలాఖరులోగా రైతులకు సొమ్ము అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.