భారత్ -జపాన్ లు ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్య దేశాలు:ప్రధాని మోడీ

భారత్ -జపాన్ లు ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్య దేశాలు:ప్రధాని మోడీ

ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం రక్షణ, భద్రత, వాణిజ్యం,పెట్టుబడి, విద్య, ఆరోగ్య సంరక్షణ,  అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి బహుళ రంగాలపై చర్చించారు. –

అంతకుముందు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత  కిషిదా రాజ్‌ఘాట్‌లోని సందర్శకుల పుస్తకంపై సంతకం చేశారు.

భారత్ జపాన్ బంధం దృఢమైంది..

భారత్ , జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్య దేశాలు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు దేశాలు పరస్పర ప్రజాస్వామ్య విలువలను గౌరవించుకుంటాయన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశం కావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతేడాది తామిద్దరం అనేకసార్లు కలుసుకున్నామని..కిషాదాను కలిసినప్పుడల్లా భారత్ తో ద్వైపాక్షిక సంబంధాల పట్ల ఆయన చూపే సానుకూలత, నిబద్దతను చూస్తే సంతోషం కలుగుతుందన్నారు. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది భారత్ జీ20 సమావేశాలకు అధ్యక్షతన వహించనుందని..ఇందులో తమ ప్రాధాన్యాతలను గురించి పీఎం కిషిదాకు వివరించినట్లు మోడీ చెప్పారు. దక్షిణాసియా యొక్క ప్రాధాన్యతలను వినిపించడంతో పాటు.. వసుధైవ కుటుంబాన్ని విశ్వసించే సంస్కృతిని పెంపొందించడం, అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే లక్ష్యంగా తాము  జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించబోతున్నట్లు వివరించామన్నారు. ఈ ఏడాది మేలో జపాన్ లోని హిరోషిమాలో జరిగే జీ7 నేతల సమావేశానికి తనను ఫుమియో కిషిదా ఆహ్వానించినట్లు మోడీ తెలిపారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.  ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే  G20 లీడర్స్ సమ్మిట్ కోసం భారతదేశానికి ప్రధాని ఫుమియో కిషిదా రానున్నారని..ఆయన్ను మళ్లీ  స్వాగతించే అవకాశం లభిస్తుందన్నారు. 

2023 టూరిజం ఎక్స్చేంజ్ ఇయర్

తమ ఆర్థిక సహకారం వల్ల భారతదేశం మరింత అభివృద్ధి చెందడమే కాకుండా జపాన్‌కు గణనీయమైన ఆర్థిక అవకాశాలను కూడా సృష్టిస్తుందని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. రాబోయే ఐదేళ్లలో జపాన్ నుండి భారతదేశానికి ఫైనాన్సింగ్‌లో 5 ట్రిలియన్ యెన్‌ల పబ్లిక్ & ప్రైవేట్ పెట్టుబడిని సాధించే దిశగా భారత్ స్థిరమైన పురోగతి సాధించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు.  2023 సంవత్సరం ఇరు దేశాల టూరిజం ఎక్స్చేంజ్ సంవత్సరం అన్నారు. అటు జీ7 సమావేశానికి ప్రధాని మోడీని ఆహ్వానించామని..తమ ఆహ్వానాన్ని వెంటనే మోడీ ఆమోదించారని చెప్పారు. భారత్ జపాన్ ఎప్పటికీ డీకార్బనైజేషన్,ఎనర్జీపై  పని చేస్తూనే ఉంటామన్నారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా  సోమవారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు కేంద్ర  మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. జపాన్ ప్రధానికి స్వాగతం పలకడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని మంత్రి ట్వీట్ చేశారు.