ఆస్ట్రేలియా, ఇండియా ఫ్రెండ్​షిప్​కు భారత సంతతి ప్రజలే కీలకం: మోడీ

ఆస్ట్రేలియా, ఇండియా ఫ్రెండ్​షిప్​కు భారత సంతతి ప్రజలే కీలకం: మోడీ
  • యోగా, క్రికెట్, సినిమాలు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వారధులు: మోడీ
  • మోడీ ఎక్కడికెళ్లినా రాక్ స్టార్ లా స్వాగతం: ఆస్ట్రేలియా ప్రధాని

సిడ్నీ: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య స్నేహ బంధానికి పరస్పర గౌరవం, విశ్వాసమే బలమైన పునాదులు వేశాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం సిడ్నీ నగరంలోని కుడోస్ బ్యాంక్ ఎరెనాలో వేలాది మంది భారత సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో కలిసి మోడీ మాట్లాడారు. ‘‘ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఎంతో దూరం ఉంది. కానీ రెండు దేశాలను హిందూ మహాసముద్రం కలుపుతోంది.

అలాగే యోగా, క్రికెట్, టెన్నిస్, సినిమాలు ఎన్నో ఏండ్లుగా మనల్ని కలిపి ఉంచుతున్నాయి. మన లైఫ్ స్టైల్స్ ఎంత భిన్నంగా ఉన్నాయన్నది పెద్ద విషయం కాదు. యోగా మనందరినీ కలుపుతోంది. కొన్ని దశాబ్దాలుగా క్రికెట్ మనల్ని కలిపి ఉంచుతోంది. ఇప్పుడు టెన్నిస్, సినిమాలు, మాస్టర్ చెఫ్​కుకింగ్ షో వంటివి కూడా రెండు దేశాల మధ్య వారధులుగా నిలుస్తున్నాయి. క్రికెట్ ఫీల్డ్ లో రెండు దేశాల మధ్య పోటీ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, ఫీల్డ్ వెలుపల మన స్నేహం అంతకంటే బలంగా ఉంటుంది. ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వార్న్ చనిపోయినప్పుడు లక్షలాది మంది ఇండియన్లు విషాదంలో మునిగిపోయారు” అని ఆయన వివరించారు. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పెరిగాయని, భవిష్యత్తులో మరింతగా పెరుగుతాయన్నారు. ఆస్ట్రేలియాలోని ఇండియన్లు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నందున బ్రిస్బేన్ సిటీలోనూ ఇండియన్ కాన్సులేట్ ను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మోడీ ప్రకటించారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం సిడ్నీ, మెల్ బోర్న్, పెర్త్ సిటీల్లో మాత్రమే ఇండియన్ కాన్సులేట్స్ ఉన్నాయి. 

రెండు దేశాలది ‘3సీ.. 3డీ.. 3ఈ’ బంధం  

ఒకప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు అంటే.. 3సీస్ (కామన్వెల్త్, క్రికెట్, కర్రీ) అనేలా ఉండేవని మోడీ అన్నారు. ఆ తర్వాత 3డీస్ (డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ) వచ్చాయని, వాటి తర్వాత 3ఈస్ (ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్) అనేవి రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేశాయన్నారు. అయితే, ‘సీ, డీ, ఈ’ల కంటే అధికంగా పరస్పర విశ్వాసం, గౌరవమే రెండు దేశాల మధ్య ఉన్న బంధానికి అసలైన పునాదులు” అని మోడీ వివరించారు. రెండు దేశాల మధ్య స్నేహ బంధం ఇంతగా బలపడటానికి ఇక్కడి భారత సంతతి ప్రజలే కారణమన్నారు. దీంతో ఆడిటోరియం అంతా కొద్దిసేపు ‘మోడీ.. మోడీ’ అనే నినాదాలతో మారుమోగింది. సమావేశానికి ముందు వేదిక వద్దకు చేరుకున్న మోడీ, అల్బనీస్ కు వేద మంత్రోచ్ఛారణలు, ఆస్ట్రేలియా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఆహ్వానం పలికారు. ఆస్ట్రేలియా నలుమూలల నుంచి దాదాపు 21 వేల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో మూడు రోజుల పర్యటన కోసం మోడీ సోమవారం సిడ్నీకి చేరుకున్నారు. బుధవారం ఆస్ట్రేలియన్ ప్రధాని అల్బనీస్ తో జరిగే ద్వైపాక్షిక సమావేశంతో మోడీ పర్యటన ముగియనుంది. 

హారిస్ పార్క్.. ఇకపై ‘లిటిల్ ఇండియా’ 

సిడ్నీ శివార్లలో ఇండియన్ లు ఎక్కువగా నివసించే, షాపులు, హోటల్స్ నిర్వహించే హారిస్ పార్క్ ఏరియా పేరును ‘లిటిల్ ఇండియా’గా మారుస్తున్నట్లు ఈ సందర్భంగా ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. హారిస్ పార్క్ కు లిటిల్ ఇండియాగా పేరు మార్చడం పట్ల అల్బనీస్ కు మోడీ థ్యాంక్స్ చెప్పారు. హారిస్ పార్క్ లో ఇండియన్ కమ్యూనిటీ ప్రజలు పెద్ద ఎత్తున దీపావళి, ఆస్ట్రేలియా డే వంటి వేడుకలు కూడా నిర్వహిస్తుంటారని గుర్తు చేశారు. ‘‘హారిస్ పార్క్ లో రాజస్థాన్ చాట్, జిలేబీ చాలా రుచికరంగా చేస్తారని విన్నాను. నా ఫ్రెండ్ అల్బనీస్ ను కూడా అక్కడికి తీసుకెళ్లి వాటి రుచి చూపించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా” అని ఈ సందర్భంగా మోడీ కోరారు. హారిస్ పార్క్ లో రెండు దేశాల స్నేహబంధానికి, భారత సంతతి ప్రజల కృషికి గుర్తుగా ‘లిటిల్ ఇండియా’ గేట్ వే నిర్మాణానికి కూడా ఇద్దరు ప్రధానులు కలిసి శంకుస్థాపన చేశారు.

కాగా, హారిస్ పార్క్ కు లిటిల్ ఇండియాగా పేరు పెట్టాలన్న ప్రతిపాదన 2015 నుంచే ఉంది. అక్కడ లెబనాన్, ఇటలీ, గ్రీస్, చైనా సంతతి ప్రజలు కూడా ఉంటున్నందున లిటిల్ ఇండియాగా పేరు మారిస్తే కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని జియోగ్రఫిక్ నేమ్స్ బోర్డు అభ్యంతరం తెలిపింది. అయితే, గత పదిహేనేండ్లలో ఇక్కడ ఇండియన్ సంతతి జనాభా భారీగా పెరిగింది. 2021 లెక్కల ప్రకారం.. ఇక్కడ మొత్తం 5,043 మంది నివసిస్తుండగా, వీరిలో 45% మంది భారత మూలాలు ఉన్నవాళ్లే ఉన్నారని తేలింది. దీంతో ఈ ఏరియా పేరు మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఇండియా అతిపెద్ద ‘ట్యాలెంట్ ఫ్యాక్టరీ’ 

ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థ వేగుచుక్కలా నిలుస్తోందని ప్రధాని మోడీ అన్నారు. అనేక దేశాలు ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోతుంటే.. ఇండియన్ ఎకానమీ మాత్రం ఎన్ని సవాళ్లు ఎదురైనా చెక్కుచెదరలేదని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ కూడా ప్రశంసించాయన్నారు. ఇండియా నేడు ప్రపంచంలోనే అత్యధిక మంది యువతతో కూడిన అతిపెద్ద ట్యాలెంట్ ఫ్యాక్టరీగా మారిందన్నారు. నిరుడు రెండు దేశాల మధ్య ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిందని, దీని ఫలితంగా వచ్చే ఐదేండ్లలో రెండు దేశాల మధ్య వ్యాపారం డబుల్ అవుతుందన్నారు. ఇప్పుడు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం కుదుర్చుకునే దిశగానూ ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014లో తాను తొలిసారిగా ఆస్ట్రేలియాకు వచ్చానని మోడీ గుర్తు చేసుకున్నారు. తాను మళ్లీ తిరిగి వస్తానని, ఇండియన్ ప్రధాని ఆస్ట్రేలియాకు వచ్చేందుకు మరో 28 ఏండ్లు వెయిట్ చేయించబోనని చెప్పారు. ఇప్పుడు తన మాటను నిలబెట్టుకున్నానని మోడీ ఈ సందర్భంగా అన్నారు.

పలు రంగాల ప్రముఖులతో భేటీ

ఆస్ట్రేలియాలో సైన్స్, ఏఐ, సోషల్ వర్క్, మ్యూజిక్ వంటి రంగాల్లో విశేష కృషి చేస్తున్న పలువురు ప్రముఖులతోనూ మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తోడ్పడాలని కోరారు. మోడీతో భేటీ అయినవారిలో నోబెల్ గ్రహీత బ్రియాన్ పాల్ స్మిత్, టాయిలెట్ వారియర్ మార్క్ బల్లా, ఆర్టిస్ట్ డేనియల్ మెట్, రాక్ స్టార్ గై సెబాస్టియన్, సెలబ్రిటీ చెఫ్ సారా టాడ్, న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీలో ఏఐ ఇనిస్టిట్యూట్ చీఫ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ టోబీ వాల్ష్, సోషియాలజిస్ట్ సాల్వటోర్ బాబోన్స్ వంటి వారు ఉన్నారు.

మోడీ ఈజ్ ద బాస్: అల్బనీస్

ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడని, ఆయన ఎక్కడికెళ్లినా ఒక రాక్ స్టార్ లా ఘనంగా స్వాగతం లభిస్తోందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. ‘‘కుడోస్ బ్యాంక్ ఎరెనాలో చివరిసారిగా అమెరికన్ సింగర్ బ్రూస్ స్ప్రింగ్ స్టీన్ కు గతంలో గ్రాండ్ వెల్ కం లభించడం చూశాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా మోడీకి ఇక్కడ స్వాగతం లభించింది. స్ప్రింగ్ స్టీన్ ను ‘ది బాస్’ అని అభిమానులు పిలుస్తారు. కానీ ఇప్పుడు మోడీ ఈజ్ ద బాస్” అని ఆయన ప్రశంసించారు.