మరోసారి ప్రధాని హైలెవల్ మీటింగ్

మరోసారి ప్రధాని హైలెవల్ మీటింగ్

ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించడానికి ఈ సమావేశంలో ప్రధాని చర్చించారు. భేటీకి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్ దోవల్ మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు. 

రష్యా సైనిక కార్యకలాపాల మధ్య ఉక్రెయిన్ నుండి భారతీయులను క్షేమంగా దేశానికి తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ గంగా కింద జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించడానికి ప్రధాన మంత్రి సోమవారం రెండు సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యల నేపథ్యంలో భద్రతపై కేబినెట్ కమిటీ ఫిబ్రవరి 24న సమావేశమైంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న నాలుగు పొరుగు దేశాలకు ప్రభుత్వం 'ప్రత్యేక దూతలను' మోహరించి, భారతీయ పౌరుల తరలింపు ప్రక్రియను సమన్వయం చేయడానికి, పర్యవేక్షిస్తోంది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ హంగేరిలో, కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు స్లోవేకియాలో, పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రొమేనియాలో, పోలాండ్‌లో రోడ్డు రవాణా ,హైవేలు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ VK సింగ్ హంగేరిలో విద్యార్థులను తరలింపు ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్నారు.