- మహారాష్ట్ర సభలో ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటు
- విదేశాలకు వెళ్లి సొంత దేశంపై విషం చిమ్మడమేంటని ఫైర్
- గాంధీ, గాడ్సేల్లో మోదీ మద్దతు ఎవరికి?: కాంగ్రెస్
ముంబై : కాంగ్రెస్ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇప్పుడున్నది మహాత్మాగాంధీ వంటి గొప్ప వ్యక్తులతో ఉన్న కాంగ్రెస్ కాదని..నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి పూర్తిగా చచ్చిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతల్లో ప్రస్తుతం ద్వేషంతో నిండిన దెయ్యం ప్రవేశించిందని..అందుకే వాళ్లు విదేశాలకు వెళ్లి మరీ సొంత దేశంపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. విశ్వకర్మ యోజన స్కీమ్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది.
ఈ సభకు చీఫ్ గెస్ట్ గా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంతో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. "నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి చచ్చిపోయి, ద్వేషమనే దెయ్యం ప్రవేశించింది. విదేశాలకు వెళ్లి సొంత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేశ సంస్కృతిని, భరతమాతను అవమానిస్తున్నారు. దేశంలో అత్యంత అవినీతికరమైన కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాచరిక కుటుంబమే. అబద్ధం, ద్రోహం కాంగ్రెస్ ముఖ్య లక్షణాలు. ఆ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇంకా నెరవేర్చలేదు. కేవలం అవినీతి చేయడానికి, బుజ్జగింపు రాజకీయాలు చేయడానికే రైతులను కాంగ్రెస్ ఉపయోగించుకుంటున్నది" అని మోదీ తీవ్ర విమర్శలు చేశారు.
గణేశ్ ఉత్సవాలనూ వ్యతిరేకిస్తున్నరు
గణపతి ఉత్సవాలను కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదని ప్రధాని ఆరోపించారు. " నేను ఇటీవల సీజేఐ ఇంట్లో జరిగిన గణేశ్ పూజా కార్యక్రమానికి వెళ్లాను. కాంగ్రెస్ నేతలు దాన్ని తప్పుబడుతున్నారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశ ప్రజల మధ్య ఐక్యతను పెంచడానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గణపతి ఉత్సవాన్ని ప్రారంభించారు.138 ఏండ్లుగా నిర్వహిస్తున్న గణేశ్ పూజలను కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ద్వేషిస్తున్నారు.
కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వినాయకుని విగ్రహాన్ని పోలీస్ జీపులో ఎక్కించి, దేవుడ్ని అవమానించింది. దీనిపై మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)తో సహా కాంగ్రెస్ మిత్రపక్షాలు మౌనంగా ఉన్నాయి. కాబట్టి మనమంతా ఏకమై కాంగ్రెస్ చేస్తున్న పాపపు పనులకు తగిన బుద్ధి చెప్పాలి "అని మోదీ పేర్కొన్నారు.
మీ మద్దతు ఎవరికి?: కాంగ్రెస్
వార్ధా సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ మండిపడింది. మహాత్మా గాంధీ, నాథూరామ్ గాడ్సేల్లో ప్రధాని మద్దతు ఎవరికని ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా మోదీకి 3 ప్రశ్నలు సంధించారు. "రైతు ఆత్మహత్యల నివారణకు బీజేపీ తీసుకుంటున్న చర్యలేమిటి? ఆదివాసీలకు మేలు చేసే అటవీ హక్కుల చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లే? గాంధీ, గాడ్సేల్లో ప్రధాని మద్దతు ఎవరికి?" అని రమేశ్ నిలదీశారు. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రంలో రోజుకు సగటున ఏడుగురు రైతులు సూసైడ్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.