
- తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నం: ప్రధాని
- రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
వరంగల్/ హనుమకొండ,వెలుగు: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని, ఇందులో భాగంగా గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన కనెక్టివిటీపై దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రూ.6,100 కోట్లతో నిర్మించనున్న జగిత్యాల--–కరీంనగర్–-వరంగల్ ఇంటర్ కారిడార్ ఫోర్ లైన్, నాగపూర్-–విజయవాడ ఎకనామికల్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు కాజీపేటలో నిర్మించే రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు ఆయన వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం ఎల్లప్పుడూ గొప్పదన్నారు.
కరోనా సమయంలో వ్యాక్సిన్‌ను అందించిందని గుర్తుచేశారు. దేశ చరిత్రలో ఇది ఒక గోల్డెన్ పిరియడ్ అని, దేశ పురోగతిలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధునిక కోచ్‌లు, లోకోమోటివ్‌ల ఉత్పత్తితో భారతీయ రైల్వేలు తయారీ రంగంలో ముందున్నాయని, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌లో భాగంగా భారత రైల్వే ప్రాజెక్టులో కాజీపేట కూడా భాగస్వామిగా చేరిందని ఆయన తెలిపారు. కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నిర్మించడం వల్ల కొత్తగా ఎందరికో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మల్టీ మోడల్ కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగా నాగ్‌పూర్–--విజయవాడ కారిడార్ లోని మంచిర్యాల, -వరంగల్ సెక్షన్ తో ఇటు తెలంగాణకు, అటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తోనూ కనెక్టివిటీ పెరుగుతుందని వివరించారు. కరీంనగర్– -వరంగల్ సెక్షన్ ను నాలుగు లైన్లుగా మార్చటం వల్ల హైదరాబాద్ –- వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, వరంగల్ సెజ్ ఎక్కువగా లబ్ధిపొందుతాయని ప్రధాని మోదీ చెప్పారు.
మరో రెండు లక్షల కోట్లతో అభివృద్ధి : గడ్కరీ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రూ.లక్షా 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను పూర్తి చేసి జాతీయ రహదారులను అభివృద్ధి చేశామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మరో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో తొమ్మిదేండ్ల కిందట 2,500 కిలోమీటర్ల హైవే ఉంటే.. ఇప్పుడు జాతీయ రహదారుల కనెక్టివిటీ 5 వేల కిలోమీటర్లకు చేరిందన్నారు. రహదారుల విస్తరణతో తెలంగాణ ప్రత్యేక కారిడార్ గా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్‌లో దేశంలో మౌలిక వసతులు, కనెక్టివిటీకి అత్యంతప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగానూ పెద్దపల్లి మినహా 32 జిల్లాలకు అనుసంధానంగా ఎన్‌హెచ్‌లు ఏర్పాటు అయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్-– -యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్ మెంట్‌కు భూమిపూజ చేశారని అన్నారు. కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్టును 160 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని, దీంతో వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాల సభలో గవర్నర్ తమిళిసై, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.