 
                                    - అవి ఎప్పుడూ కలిసి ఉండవు.. ఒక్క మాట మీద నిలబడవు: ప్రధాని మోదీ
- నన్ను అవమానించడమే జన్మహక్కుగా రాహుల్, తేజస్వీ ఫీల్ అవుతున్నరు
- మళ్లీ దోచుకోవడానికే వాళ్లు జనం ముందుకు వస్తున్నరు
- ఛత్ పూజను కూడా అవమానించారని ఫైర్
- బిహార్‌లో మోదీ  ప్రచారం
పాట్నా: కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలది నూనె, నీళ్ల లాంటి బంధమని.. ఎప్పుడూ ఆ రెండు పార్టీలు ఒక మాట మీద ఉండవని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. తనను అవమానించడం వారి జన్మహక్కు అన్నట్లుగా రాహుల్‌గాంధీ, తేజస్వీ యాదవ్ భావిస్తున్నారని.. వారికి ఓటర్లే బుద్ధిచెప్తారని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ప్రధాని మోదీ ముజఫర్‌పూర్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ‘మహాఘట్బంధన్’పై విమర్శలు గుప్పించారు. పోలింగ్ కంటే ముందే కూటమిలో చీలికలు వచ్చాయన్నారు. అలాంటి పార్టీలు ప్రజలకు ఏంచేస్తాయని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్, ఆర్జేడీ బంధం నూనె, నీళ్ల లాంటిది. బాటిల్లో నూనె, నీళ్లను పోస్తే.. అవి ఎప్పుడైనా కలిసి ఉంటాయా? ఈ రెండు పార్టీలూ అంతే” అని ఆయన వ్యాఖ్యానించారు.
జంగల్ రాజ్ వద్దు
బిహార్‌లో ఆర్జేడీ పాలన జంగల్ రాజ్ లాంటిదని.. అలాంటి పాలనను ఇక్కడ ప్రజలు ఎవరూ కోరుకోవడంలేదని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఆర్జేడీ జంగల్ రాజ్ పాలనలో అన్నిట్లో అవినీతి. దేనినీ వదలలేదు. వాళ్ల హయాంలో 35వేలకు పైగా కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఆటవిక రాజ్యం నడిపారు. అలాంటి పాలన వద్దు” అని పేర్కొన్నారు.
‘‘ఎన్నికల ర్యాలీల్లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నన్ను అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. ఇతరులను.. ముఖ్యంగా నన్ను అవమానించడం వాళ్ల జన్మహక్కు అన్నట్లుగా భావిస్తున్నారు. బిహార్‌ను మళ్లీ దోచుకోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి జనం వద్దకు వస్తున్నాయి” అని మోదీ దుయ్యబట్టారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ఏనాడూ బిహార్ అభివృద్ధి కోసం పాటుపడలేదని.. దోచుకోవడమే ఆ పార్టీల పని అని ఆరోపించారు.
‘‘ఆర్జేడీ – కాంగ్రెస్ పాలనను ఐదు పదాల్లో చెప్పొచ్చు. 1. కట్టా (నాటు తుపాకులు), 2. క్రూరతా (క్రూరత్వం), 3. కటుతా (సామాజిక అసహనం), 4. కుషాసన్ (దుష్పరిపాలన), 5. కరప్షన్ (అవినీతి). దీన్ని సమాజం ఎప్పటికీ స్వాగతించదు” అని ఆయన పేర్కొన్నారు.
వాళ్లు ఛత్ పూజనూ అవమానించారు
ఎంతో పవిత్రమైన ఛత్ పూజను ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు అవమానించారని.. డ్రామాలంటూ ఇష్టమున్నట్లు మాట్లాడారని ప్రధాని మోదీ అన్నారు.

 
         
                     
                     
                    