V6 News

డీలిమిటేషన్తో సౌత్కు అన్యాయం జరగదు.. నేను హామీ ఇస్తున్నా: లోక్సభలో ప్రధాని మోదీ

డీలిమిటేషన్తో సౌత్కు  అన్యాయం జరగదు.. నేను హామీ ఇస్తున్నా: లోక్సభలో ప్రధాని మోదీ
  • దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపం.. ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని వెల్లడి
  • మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం
  • మూడు బిల్లులపై నేడు ఓటింగ్


న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష చూపడం లేదని, అంతేకాకుండా డీలిమిటేషన్ తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని తాను మాట ఇస్తున్నానని చెప్పారు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఏ రాష్ట్రానికీ డీలిమిటేషన్ తో అన్యాయం చేయబోం అని స్పష్టం చేశారు. 

పార్లమెంట్ మూడు రోజుల ప్రత్యేక సమావేశాల సందర్భంగా గురువారం లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య 40 నిమిషాల పాటు వాడివేడి చర్చ జరిగింది. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాలని ప్రతిపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఆ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దని ఆయన కోరారు. గతంలో మహిళా బిల్లును వ్యతిరేకించిన వారిని మహిళలు క్షమించలేదని, ఈసారి కూడా అలాగే చేస్తే అదే ఫలితం పునరావృతం అవుతుందని హెచ్చరించారు. జాతి ప్రయోజనాల కోసం ఈ బిల్లును తెచ్చామని చెప్పారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు గిఫ్ట్  కాదు. అది వారి హక్కు” అని మోదీ స్పష్టం చేశారు. 

సపోర్ట్ చేస్తే.. క్రెడిట్ ప్రతిపక్షాలకే

మహిళా కోటా బిల్లుకు సపోర్టు చేస్తే క్రెడిట్ మొత్తం ప్రతిపక్షాలకే ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు. ‘‘131వ రాజ్యాంగ సవరణ కింద లోక్ సభ సీట్లను 543 నుంచి 850 సీట్లకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. దీంతో రాష్ట్రాల సీట్లు 815కు, యూటీల సీట్లు 35కు పెరుగుతాయి. ఈ బిల్లు పాస్ అయితే డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణతో పాటు మహిళా బిల్లుకు మార్గం సుగమం అవుతుంది. బిల్లులు పాస్ అవడానికి మీరు(ప్రతిపక్షాలు) సహకరిస్తే, క్రెడిట్ మొత్తం మీకే ఇస్తాం” అని మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆ మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు జరిగిన ఓటింగ్​లో 251 మంది ఎంపీలు మద్దతు ఇవ్వగా.. 185 మంది వ్యతిరేకించారు.  

  • 40 నిమిషాల పాటు వాడివేడి చర్చ..

కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026పై సుమారు 40 నిమిషాల పాటు  వాడివేడి చర్చ జరిగింది. అయితే, రాజ్యాంగ(131వ సవరణ) బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు ఓటింగ్ (డివిజన్ ఆఫ్ ఓట్స్) కోరాయి. ఈ బిల్లులకు మద్దతుగా 251 మంది సభ్యులు, వ్యతిరేకంగా 185 మంది సభ్యులు ఓటు వేయడంతో బిల్లులను ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. మహిళా కోటా చట్టంలో తాజాగా ప్రతిపాదించిన మార్పులను పార్లమెంట్ గతంలో ఆమోదించినప్పుడే ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. బిల్లులను ప్రవేశపెట్టడానికి ఎందుకు ఇంత తొందర పడుతున్నారని సమాజ్‌‌వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. "చట్టసభల్లో మహిళా కోటాను మేము సమర్థిస్తున్నాం, కానీ జనాభా గణనను ఎందుకు నిర్వహించకూడదు?" అని ఆయన అడిగారు

. కాగా, మహిళా రిజర్వేషన్ చట్టం సవరణలకు నిరసనగా డీఎంకే సభ్యులు లోక్‌‌సభలో నల్ల దుస్తులు ధరించి హాజరయ్యారు. "మేం 2023 మహిళా కోటా చట్టానికి అనుకూలం. కానీ ప్రస్తుత బిల్లు లక్ష్యం నియోజకవర్గాల పునర్విభజన" అని డీఎంకే నాయకుడు టీఆర్ బాలు అన్నారు. 
మహిళా కోటా చట్ట సవరణను ఆర్‌‌ఎస్‌‌పీ నాయకుడు ఎన్.కె. ప్రేమచంద్రన్ వ్యతిరేకిస్తూ.. ఇది రిజర్వేషన్ కోసం కాదు, పునర్విభజన కోసం అని విమర్శించారు. 

రాజ్యాంగ సవరణ బిల్లును ఇతర సాధారణ బిల్లులతో కలిపి చర్చించలేమని వేణుగోపాల్ అన్నారు. అయితే అలా చేయవచ్చని అమిత్ షా ఆ అభ్యంతరాన్ని తోసిపుచ్చారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఒకే అంశానికి సంబంధించినది కాబట్టి ఇతర బిల్లులతో 
కలిపి చర్చించవచ్చని స్పీకర్ ఓం బిర్లా కూడా గత ఉదాహరణలను ప్రస్తావించారు.

డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ (ఏప్రిల్ 17) ఓటింగ్ 

పార్లమెంట్ ప్రత్యేక సెషన్ లో భాగంగా మూడు రోజుల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ (131వ) సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2026ను ప్రవేశపెట్టడంపై ఓటింగ్ (డివిజన్) జరిగిన తర్వాత ఆ బిల్లులు లోక్‌‌సభలో పరిశీలనకు వచ్చాయి. లోక్‌‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం (మహిళా రిజర్వేషన్ చట్టం) సవరణలను 2029 నాటికి అమలు చేసేలా ఆమోదం కోసం ఈ బిల్లులను తీసుకువచ్చారు. 

మహిళా కోటా చట్టాన్ని సవరించడం, పునర్విభజన కమిషన్‌‌ను ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించిన బిల్లులను ఎన్డీయే నాయకులు సమర్థించారు. మహిళలు రిజర్వేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని వారు చెప్పారు. అయితే, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దేశ సమాఖ్య, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఈ బిల్లుల ఆమోదంపై ఓటింగ్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జరిగే అవకాశాలు ఉన్నాయి.