
న్యూఢిల్లీ: దేశంలోని ఎంపీలంతా పరిశుభ్రతలో పోటీపడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొత్తగా నిర్మించిన మల్టీస్టోర్అపార్ట్మెంట్స్ ఆవరణలో దేశంలోని విభిన్న పండుగలను జరుపుకోవాలని సూచించారు. పార్లమెంట్ సభ్యుల కోసం ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్లతో కూడిన టైప్ 7 మల్టీస్టోర్అపార్ట్మెంట్స్ను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. అక్కడి 4 టవర్లకు కోసి, కృష్ణ, గోదావరి, హుగ్లీ అని నదుల పేర్లను పెట్టారు. ఆ భవన సముదాయం ఆవరణలో సిందూర్ మొక్కను నాటారు. అనంతరం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలతో ముచ్చటించారు.
కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘కొన్ని రోజుల క్రితం నేను కర్తవ్య పథ్‌లో కామన్ సెంట్రల్ సెక్రటేరియెట్‌ను ప్రారంభించాను. ఈ రోజు నా పార్లమెంట్ సహచరుల కోసం ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించే అవకాశం లభించింది. ఈ 4 టవర్లకు కృష్ణ, గోదావరి, కోసి, హుగ్లీ అని 4 గొప్ప నదుల పేర్లు పెట్టాం. ఇవి కోట్లాది మందికి జీవనాధారం.
ఈ నదుల ప్రేరణతో మన ప్రజాప్రతినిధుల జీవితాల్లో కూడా ఆనందమనే కొత్త ధార ప్రవహిస్తుంది. కొంతమందికి కోసి నది పేరు వినగానే ఇబ్బందనిపిస్తుంది. వారు దీన్ని నదిగా చూడరు. బిహార్ ఎన్నికలతో ముడిపెట్టి చూస్తారు. అలాంటి చిన్న మనస్తత్వం ఉన్నవారి ఇబ్బందుల మధ్యలో కూడా, నేను కచ్చితంగా చెప్తాను. -ఈ నదుల పేర్ల సంప్రదాయం దేశ ప్రజలను ఏకం చేస్తుంది” అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 2004–2014 మధ్య ఎంపీల కోసం ఒక్క నివాసాన్ని నిర్మించలేదని, తమ ప్రభుత్వం 350 ఇండ్లను నిర్మించిందని చెప్పారు. ఎంపీల కోసం నిర్మించిన పాత ఇండ్లలో అనేక సమస్యలు ఉండేవని, వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 5 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ కార్పెట్ విస్తీర్ణంలో ఈ ఆధునిక ఫ్లాట్లను నిర్మించినట్టు చెప్పారు. ఎంపీలు తమ సొంత సమస్యల నుంచి విముక్తి పొందినప్పుడు.. వారు తమ టైంను, శక్తిని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటారని మోదీ తెలిపారు.