
ముంబై వేదికగా ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్) గురువారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. భారతీయ వినోద పరిశ్రమ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ సమిట్‌ను నిర్వహిస్తోంది. ‘కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్’అనే నినాదంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు జరుగుతోంది.
ఈ ప్రారంభ వేడుకలకు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు, ప్రముఖ తారలు హాజరయ్యారు. రజినీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తితో పాటు అలనాటి హీరోయిన్ హేమ మాలిని ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అలరించారు.
బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, సైఫ్ అలీఖాన్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, రణ్ బీర్ కపూర్, అలియా భట్, సారా అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇక టాలీవుడ్ నుంచి దర్శకుడు రాజమౌళి, నటులు నాగార్జున, అల్లు అర్జున్, నాగచైతన్య, శోభిత, సంగీత దర్శకుడు కీరవాణి, సింగర్ చిత్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదు. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక. గత వంద సంవత్సరాలలో భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకు చేరుకుంది. మారుతున్న టెక్నాలజీ నుంచి యంగ్ జనరేషన్‌ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది’అని అన్నారు.