- ఎల్గోయి వద్ద స్క్రీన్ ద్వారా వీక్షించిన ప్రజలు
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన హెచ్ఐసీసీ ప్రాంగణం నుంచే ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘం, న్యాల్కల్ మండలాల పరిధిలో 12,650 ఎకరాల్లో నిర్మిస్తున్న జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టులో 3,245 ఎకరాల్లో స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్(ఎన్ఐసీడీఐటీ), తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) సంయుక్తంగా రూ.2,369 కోట్లతో స్మార్ట్ సిటీ ని నిర్మిస్తున్నారు.
ప్రధాని శంకుస్థాపన చేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో జహీరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. 2024లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ప్రకటించింది. వాటిలో తెలంగాణలోని జహీరాబాద్ ఒకటి. మోదీ వర్చువల్ గా పనులు ప్రారంభించడంతో ఆ దృశ్యాలను నిమ్జ్ ప్రాంతంలో ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా అధికారులు, ప్రజలు వీక్షించారు. కార్యక్రమంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, ఆర్డీఓ దేవుజా, టీజీఐఐసీ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
