చైనా ఇష్యూపై మోడీకి ఫోన్ చేశా.. ఆయ‌న మూడ్ బాగోలేదు: ట‌్రంప్

చైనా ఇష్యూపై మోడీకి ఫోన్ చేశా.. ఆయ‌న మూడ్ బాగోలేదు: ట‌్రంప్

భార‌త్, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దులో త‌లెత్తిన ప్ర‌తిష్ఠంభ‌న తొల‌గించేందుకు మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసేందుకు తాను సిద్ధ‌మ‌ని అమెరికా అధ్య‌క్షుడు మ‌రోసారి ప్ర‌క‌టించారు. త‌న ప్ర‌మేయం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని రెండు దేశాలు భావిస్తే తాను అందుకు సిద్ధంగానే ఉన్నాన‌ని చెప్పారు. గురువారం ఆయ‌న వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ల‌ఢ‌ఖ్ లోని ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనా బ‌ల‌గాలు భార‌త్ భూభాగంలోకి దూసుకొచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఉద్రిక్త‌త నెలకొన్న నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య తాను మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేస్తానంటూ బుధ‌వారం ట్రంప్ ట్వీట్ చేశారు. దానికి క‌ట్టుబడి ఉన్నాన‌ని మ‌రోసారి గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారాయ‌న‌. చైనా ఇష్యూ గురించి తాను ప్ర‌ధాని మోడీతో ఫోన్ లో మాట్లాడాన‌ని, ఆ స‌మ‌యంలో ఆయ‌న మూడ్ ఏం బాగోలేద‌ని, చైనా తీరుప‌ట్ల అసంతృప్తితో ఉన్నార‌ని చెప్పారు. 140 కోట్ల జ‌నాభా ఉన్న రెండు పెద్ద దేశాలు భార‌త్, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు విష‌యంలో స‌మ‌స్య న‌డుస్తోంద‌న్నారు ట్రంప్. ఈ రెండు దేశాలూ బ‌ల‌మైన మిల‌ట‌రీ శ‌క్తి ఉంద‌ని, ప్ర‌స్తుతం న‌డ‌స్తున్న ఇష్యూలో ఇటు భార‌త్, అటు చైనా కూడా అసంతృప్తితో ఉన్నాయ‌ని అన్నారు. దీనిపై తాను ప్ర‌ధాని మోడీతో మాట్లాడాన‌ని, చైనాతో ప్ర‌స్తుతం న‌డుస్తున్న ఇష్యూ విష‌యంలో ఆయ‌న ఏ మాత్రం హ్యాపీగా లేర‌ని ట్రంప్ చెప్పారు. కాగా, చైనాతో త‌లెత్తిన ఈ స‌మ‌స్య‌ను సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా చర్చ‌ల‌తోనే ప‌రిష్క‌రించుకుంటామ‌ని భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మ‌రోవైపు చైనా కూడా స‌రిహ‌ద్దులో అంతా శాంతియుతంగానే ఉందంటూ ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త్, చైనా చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునేందుకు మంచి వాతావ‌ర‌ణం ఉందంటూ చైనా విదేశాంగ శాఖ వెల్ల‌డించింది.