
- ఒత్తిడి పెరుగుతది..పర్లేదు తట్టుకుంటం: ప్రధాని మోదీ
- అమెరికా టారిఫ్‌ల డెడ్‌లైన్ పై మోదీ కామెంట్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన అదనపు సుంకాలకు ఈ రోజు (మంగళవారం) తో డెడ్ లైన్ ముగియనుంది. బుధవారం నుంచి 25 శాతం అదనపు సుంకాలు అమలులోకి రానున్నాయి. దీంతో అమెరికాకు ఎగుమతయ్యే భారత వస్తువులపై మొత్తంగా 50 శాతం టారిఫ్‌ను వసూలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. అమెరికా టారిఫ్‌లతో దేశంపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. అయితే, పెరిగే ఒత్తిడిని తట్టుకునే శక్తి భారత్‌కు ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఎంత ఒత్తిడి తీసుకొచ్చిన సరే రైతులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడబోదని మోదీ తేల్చిచెప్పారు. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత 25 శాతం టారిఫ్‌లు విధించారు. ఆ తర్వాత యుద్ధం ఆపాలంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు మరిన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్ పై అదనంగా 25 శాతం టారిఫ్ లు విధించారు.
పీఎంఓలో హైలెవల్ మీటింగ్
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చించేందుకు ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మంగళవారం హైలెవల్ మీటింగ్ జరిగే అవకాశం ఉంది.