ఈవీలకు ఇన్సెంటివ్స్​ ఇస్తం

ఈవీలకు ఇన్సెంటివ్స్​ ఇస్తం
  •     కార్బన్​ ఎమిషన్స్​ తగ్గించడమే లక్ష్యం
  •     ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ :  కార్బన్​ ఎమిషన్స్​  తగ్గించి, సుస్థిరత లక్ష్యాన్ని సాధించడానికి ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పరిశ్రమకు మరిన్ని ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని  ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.  “ఎలక్ట్రిక్ వెహికల్స్​ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పరిశ్రమ గొప్ప ఇన్నోవేషన్లతో ముందుకు వచ్చింది. ఈవీలను కొనుగోలు చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు” అని ఒక ఇంగ్లిష్​ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ అన్నారు.  స్థానిక తయారీకి కట్టుబడి ఉన్న కంపెనీలకు దిగుమతి పన్నులను తగ్గించే కొత్త ఈవీ విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సమయంలో ప్రధాని ఈ సంగతి చెప్పారు.

కొత్త విధానం ఫలితంగా ఆటోమేకర్లు భారతదేశంలోకి ఈవీలను 15 శాతం తక్కువ పన్నుతో దిగుమతి చేసుకోవచ్చు. 40 వేల డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఈవీలకు ప్రస్తుతం   100 శాతం ఎగుమతి పన్ను విధిస్తున్నారు.  మిగిలిన వాటికి 70 శాతం పన్ను ఉంటుంది. ఈ ఏడాది జూన్​లో, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫేమ్​–2 పథకం కింద ఎలక్ట్రిక్ టూవీలర్లపై సబ్సిడీని కిలోవాట్​ అవర్​కు రూ. 15,000 నుంచి రూ. 10,000కి తగ్గించాలని నిర్ణయించింది. ప్రతి కిలోవాట్​ అవర్​కు ప్రోత్సాహకాన్ని రూ. 5,000 తగ్గించడమే కాకుండా, బండి ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 40 శాతం గరిష్ట సబ్సిడీ పరిమితిని 15 శాతానికి తగ్గించింది. సబ్సిడీ కోతలు ఉన్నప్పటికీ, ఈవీలకు డిమాండ్​ తగ్గడం లేదు.  

ప్రభుత్వ వాహన్ వెబ్‌‌సైట్ ప్రకారం, జూలై 2023లో రెండు, మూడు,  నాలుగు చక్రాల (కార్లు,  ఎస్​యూవీలు) విభాగాల్లో  ఈవీ రిటైల్ అమ్మకాలు, అలాగే కమర్షియల్ ​వెహికల్స్​ అమ్మకాలు ఈ ఏడాదిలో మొత్తం 115,836 యూనిట్లుగా ఉన్నాయి. వాస్తవానికి, సబ్సిడీ కోత తర్వాత కూడా జూన్‌‌లో, ఆగస్టులో ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాల జోరు తగ్గలేదు. ఇదే ఈ ఏడాది ఆగస్టులో 45 వేల యూనిట్లు, జూన్‌‌లో 59,000 యూనిట్లు అమ్ముడుపోయాయి.  

ఇదే ఏడాది ఆగస్టులో 59,313 యూనిట్ల అమ్మకాలు ఉండగా, అంతకు ముందు నెలలో 54,498 బండ్లు అమ్ముడుపోయాయని వాహన్ వెబ్‌‌సైట్  డేటా తెలిపింది. నెలానెలా ఈవీల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.