
మహరాజ్ గంజ్: ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితంచేసే అంతర్జాతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మన దేశం మరింత శక్తిమంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఉత్తరప్రదేశ్లోని మహరాజ్గంజ్లో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అతిపెద్ద రాష్ట్రంగా.. దేశాన్ని బలంగా తయారు చేయడంలో ఉత్తరప్రదేశ్దే కీలక బాధ్యతని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు వైబ్రెంట్ విలేజ్ పేరుతో సరికొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచం చాలా సమస్యలను ఎదుర్కొంటోందని, ఏదో ఒక రూపంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై వాటి ప్రభావం పడుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితులను తట్టుకునేందుకు మన దేశం మరింత శక్తిమంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం నుంచి సైన్యందాకా, సముద్రం నుంచి అంతరిక్షం దాకా ప్రతిరంగంలో మన దేశం మిగతా ప్రంపంచానికి ధీటుగా ఎదగాలన్నారు. నేపాల్ సరిహద్దులోని మహరాజ్గంజ్ కు.. ఖుషీనగర్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తయితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు మోడీ. సరిహద్దుల్లోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని, ఉట్టి మాటలు చెప్పే అలవాటు తమకు లేదని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా బడ్జెట్లో నిధులు కేటాయించి వాటిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. కుటుంబ పాలకులు కరోనా వ్యాక్సిన్లపై ఆరోపణలు చేస్తూ.. దేశ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ మోడీ విమర్శలు చేశారు. వారు ప్రతిసారీ తమ కుటుంబ బాగోగుల గురించే ఆలోచించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.