ప్రజలకు పనికొచ్చే ప్రశ్నలు అడగండి

V6 Velugu Posted on Jul 19, 2021

  • ప్రజలకు పనికొచ్చే ప్రశ్నలు అడగండి.. జవాబివ్వడానికి రెడీ
  • ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రతిపక్షాలతో ప్రధాని మోడీ
  • ఇయ్యాల్టి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఆగస్టు 13 దాకా కొనసాగే అవకాశం
  • రైతు సమస్యలు, పెట్రో ధరల పెంపును లేవనెత్తుతామన్న ప్రతిపక్షాలు 
  • సమావేశాలు ఉన్నన్ని రోజులు పార్లమెంట్ మార్చ్ కు రైతుల ప్లాన్

న్యూఢిల్లీ: ప్రజలకు పనికొచ్చే అంశాలపై పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ‘‘ప్రజలకు సంబంధించిన సమస్యలను స్నేహపూర్వకంగా లేవనెత్తండి. ఆయా అంశాలపై స్పందించేందుకు, బదులిచ్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజా ప్రతినిధులకు కింది స్థాయి పరిస్థితి తెలుసు. చర్చల్లో వారు పాల్గొనడం వల్ల డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ మరింత ఉన్నతంగా మారుతుంది” అని అన్నారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనుండటంతో ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 33 పార్టీల లీడర్లు హాజరయ్యారు. ఆగస్టు 13 దాకా సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజున కొత్త మంత్రులను పార్లమెంటుకు ప్రధాని పరిచయం చేస్తారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ప్రమాణం చేస్తారు. మీటింగ్​కు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ వివరించారు. రూల్స్, ప్రొసీజర్ల ప్రకారం చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని చెప్పారన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చే సలహాలు, సూచనలు విలువైనవని, చర్చలు మరింత ఉన్నతంగా ఉండేలా చేస్తాయన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ సింగ్, పియూష్ గోషల్, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, టీఎంసీ నుంచి డెరెక్ ఓ బ్రెయిన్, డీఎంకే నుంచి తిరుచి శివ, ఎస్పీ నుంచి రామ్ గోపాల్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
రైతు సమస్యలపై వాయిదా తీర్మానం: ఆర్ఎస్పీ
రైతు సమస్యలపై చర్చించాలని కోరుతూ పలు పార్టీలు లోక్‌‌‌‌‌‌‌‌సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ఆర్ఎస్పీ నేత ఎన్‌‌‌‌‌‌‌‌కే ప్రేమచంద్రన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ప్రతిపక్ష పార్టీలు సపరేట్ సమావేశం నిర్వహించాయి. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్పీ, శివసేన, ఆప్ తదితర పార్టీలు హాజరయ్యాయి. వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనలు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ముఖ్యమైన అంశాలని ప్రేమచంద్రన్ అన్నారు. 
ప్రధాని ప్రసంగం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లోనే ఉండాలి
దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతారని ప్రభుత్వం చెప్పడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పార్లమెంటరీ రూల్స్‌‌‌‌‌‌‌‌ను దాటవేసేందుకు ఇది మరో దారి అంటూ ఆరోపించాయి. పార్లమెంటు కాంప్లెక్సులోని వేరే బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో సమావేశం నిర్వహిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను దాదాపు ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. ప్రభుత్వం ఏం చెప్పాలనుకున్నా ఉభయ సభల  సమావేశాలు జరుగుతున్నప్పుడే చెప్పాలని స్పష్టం చేశాయి. సెషన్స్ సందర్భంగా సభలో చర్చించాల్సిన అంశాలను బయట మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాయి.
ఎన్డీయే ఫ్లోర్ లీడర్లతో మోడీ మీటింగ్
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించారు. వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 
22 నుంచి పార్లమెంట్ వద్దకు రోజూ 200 మంది రైతులు
అగ్రిచట్టాలను రద్దు చేయాలని కోరుతూ గురువారం నుంచి రోజూ 200 మంది రైతులు పార్లమెంట్ మార్చ్ లో పాల్గొంటారని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. రోజూ పార్లమెంట్ వద్దకు ర్యాలీగా వెళ్లి బీజేపీ ఎంపీలకు రైతులు వినతిపత్రాలు ఇస్తారని, అగ్రి చట్టాలను వ్యతిరేకించాలని బీజేపీ యేతర ఎంపీలను కోరతారని తెలిపారు. కాగా, వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటు బయట నిరసనలు తెలుపుతామని, ఏ రూట్లలో వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నామని రాకేశ్ తికాయత్ చెప్పారు. దీంతో సోమవారం ఢిల్లీలోని సింఘు బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆందోళనలు చేస్తున్న రైతులతో పోలీసులు చర్చలు జరిపారు.

Tagged pm modi, parliment, Petrol price, all party meeting, parliment session

Latest Videos

Subscribe Now

More News