అన్ని రంగాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ : మోడీ

అన్ని రంగాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ : మోడీ

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ను రూపొందించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పీపుల్ ఫ్రెండ్లీ ప్రొగ్రెసివ్ బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు నిర్మలా సీతారామన్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మలమ్మ పద్దు అన్ని రంగాలకు అనుకూలమైందన్న మోడీ.. దేశ యువత ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు.  ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే సాగుతోందన్న ఆయన.. ఇంటర్నెట్, టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. గంగానది ప్రక్షాళనకు పెద్దపీట వేశామని, ఆ నదీ తీర రాష్ట్రాల్లో సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 

ఉద్యోగులు, మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాతిపదికన బడ్జెట్ను రూపొందించినట్లు మోడీ చెప్పారు. ఈ బడ్జెట్ ద్వారా 68శాతం దేశీయ పరిశ్రమలకు లాభం చేకూరుతుందని అన్నారు. రక్షణ రంగానికి బడ్జెట్లో పెద్దపీట వేశామని మోడీ ప్రకటించారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పనకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని చెప్పారు. బుధవారం ఉదయం 11గంటలకు బడ్జెట్పై విస్తృతంగా మాట్లాడతానని మోడీ ప్రకటించారు.