కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని షేక్ చేస్తోంది 

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని షేక్ చేస్తోంది 

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కఠిన పరీక్ష పెడుతోందని ప్రధాని మోడీ అన్నారు. నెలవారీ కార్యక్రమం మన్‌కీ బాత్‌‌లో కరోనాతోపాటు పలు విషయాల గురించి ఆయన మాట్లాడారు. 45 ఏండ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని మోడీ వెల్లడించారు. కేంద్రం ఆధ్వర్యంలో ఫ్రీ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని.. దీన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ఈ విషయంలో రాష్ట్రాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తామని వెల్లడించారు. 

‘మనకు కావాల్సిన వాళ్లలో చాలామంది మనల్ని విడిచి వెళ్లిపోయారు. కరోనా ఫస్ట్ వేవ్​ను విజయవంతంగా ఎదుర్కొని ఇండియా ఆత్మ విశ్వాసంతో ఉన్న సమయంలో.. ఈ తుపాను (సెకండ్ వేవ్) దేశాన్ని షేక్ చేసింది. అధికారిక వర్గాల ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకోండి. మీ ఫ్యామిలీ డాక్టర్లను కన్సల్ట్ కండి. చాలామంది డాక్టర్లు సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఫోన్ ద్వారా కన్సల్ట్ అవుతున్నారు. చాలా ఆస్పత్రులు తమ వివరాలను వెబ్ సైట్లలో పెడుతున్నాయి. కరోనా మహమ్మారిపై పోరాటంలో దేశం ఐక్యంగా ఉంది. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి చాలా మంది ఆహారం పంపిణీ చేస్తున్నారు. అవసరమైన వారికి మందులు ఇస్తున్నారు. గ్రామాల్లో అవగాహన పెరిగింది’ అని మోడీ అన్నారు. ప్రజల సహనాన్ని, నొప్పిని భరించే సామర్థ్యాన్ని సెకండ్ వేవ్ పరీక్షిస్తోందని అన్నారు. కరోనాను ఓడించడమే దేశానికి ఉన్న అతిపెద్ద ప్రయారిటీ అని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని, అలాగే జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మనం ఈ విపత్తు నుంచి బయటపడతామన్నారు.