మన మంత్రం..  నేషన్ ఫస్ట్

మన మంత్రం..  నేషన్ ఫస్ట్
  • ఒలింపిక్స్‌‌‌‌కు వెళ్లిన మన వాళ్లకు మద్దతు ఇవ్వండి
  • మన్ కీ బాత్‌‌‌‌లో ప్రధాని మోడీ కామెంట్స్

న్యూఢిల్లీ/చండీగఢ్: ‘నేషన్ ఫస్ట్’ అనే మంత్రంతో మనమందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘త్వరలో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశం జరుపుకోనుంది. భారత్ చోడో ఆందోళన్‌‌‌‌ (క్విట్ ఇండియా మూమెంట్)ను మహాత్మా గాంధీ చేపట్టినట్లుగానే.. ప్రతి ఒక్కరు భారత్ జోడో ఆందోళన్ (యూనైట్ ఇండియా మూమెంట్)లో భాగం కావాలి. ఎన్నో డైవర్సిటీస్ ఉన్న మన దేశాన్ని ఏకం చేసేందుకు ఈ నినాదం ఉపయోగపడుతుంది” అని అన్నారు. ఆదివారం మన్ కీ బాత్‌‌‌‌లో మోడీ మాట్లాడారు. ఆగస్టు 15న 75వ ఇండిపెండెన్స్ డేని అమృత్ మహోత్సవ్‌‌‌‌గా దేశం జరుపుకోనుందని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 
అమృత్ మహోత్సవ్ షురువైంది..
‘‘అమృత్ మహోత్సవ్ కోసం ఇప్పటికే కార్యక్రమాలు మొదలయ్యాయి. వీలైనంత ఎక్కువ మంది గాయకులు జాతీయ గీతాన్ని పాడేలా ఓ కార్యక్రమాన్ని  కల్చరల్ మినిస్ట్రీ చేపట్టింది. ఇందుకోసం వెబ్‌‌‌‌సైట్ కూడా షురూ చేసింది. జాతీయ గీతాన్ని ఈ వెబ్‌‌‌‌సైట్ లో అప్‌‌‌‌ లోడ్ చేయవచ్చు. రికార్డు చేయొచ్చు. తద్వారా ఈ కార్యక్రమంతో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇలాంటి క్యాంపెయిన్స్‌‌‌‌ మరిన్ని జరుగుతాయి” అని ప్రధాని వివరించారు. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లో పాల్గొంటున్న మన క్రీడాకారులను ప్రోత్సహించాలని, సపోర్టు చేయాలని కోరారు. ఈ నెల 26న కార్గిల్ విజయ్ దివస్‌‌‌‌ను దేశం జరుపుకుంటోందని, 1999లో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఆగస్టు 7న నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుగుతోందని, రూరల్, ట్రైబల్ ఏరియాల్లో హ్యాండ్లూమ్ ప్రొడక్టులే ప్రధాన ఆదాయ వనరులని మోడీ చెప్పారు. ప్రజలు వాటినే కొనుగోలు చేయాలని కోరారు.
సంజయ్ రాణాలా ఆలోచించాలి
మోడీ తన ప్రసంగంలో చండీగఢ్‌‌‌‌కు చెందిన వీధి వ్యాపారి సంజయ్ గురించి ప్రస్తావించారు. వ్యాక్సిన్‌‌ వేసుకున్న వాళ్లకు ‘ఛోలే భటురే’ ఒక ప్లేట్ ఫ్రీగా ఇస్తున్నాడని, సొసైటీ కోసం పని చేయాలంటే సంజయ్ రాణా మాదిరి ఆలోచించాలి అని మోడీ చెప్పారు.