
సాత్నా (మధ్యప్రదేశ్): దేశంలోని అందరి బతుకులు మారాలంటే కుల గణన ఒకటే మార్గమని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన చేపడ్తుందని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కూడా కుల గణన చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్లోని సాత్నా, బర్వానీ జిల్లాల్లో నిర్వహించిన ప్రచార ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిందన్నారు. మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఓబీసీలు ఎంత మంది ఉన్నారో లెక్కగడ్తామని ప్రకటించారు.
ఆ తర్వాతే అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా కొత్త పథకాలు తీసుకొస్తామన్నారు. జీవితాలు మారాలంటే కుల గణన అనేది విప్లవాత్మక అడుగని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా తాను ఓబీసీ అని చెప్పుకుంటారన్నారు. కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో మోదీ ఓబీసీ కామెంట్ చేయడం లేదని చెప్పారు. మధ్యప్రదేశ్లో 53 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే.. వారిలో ఒక్కరు మాత్రమే ఓబీసీ అని చెప్పారు. .
‘‘మధ్యప్రదేశ్ స్టేట్ బడ్జెట్ రూ.100 అనుకుంటే.. అందులో ఓబీసీకి కేవలం 33 పైసలు మాత్రమే దక్కుతాయి. గత 18 ఏండ్లలో రాష్ట్రంలో అప్పుల బాధతో 18వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ఫలితంగా నిరుద్యోగం పెరిగిందన్నారు. ఓబీసీలు ఎంత మందని లెక్కించడం మోదీకి ఇష్టంలేదని రాహుల్ విమర్శించారు. ‘‘యువతతోనే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ.. వాళ్లంతా నిరుద్యోగులుగా ఉన్నారు. వ్యవసాయం కోసం రైతులు ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు తీసుకున్నా.. జీఎస్టీ కట్టాల్సి వస్తున్నది. ఆ డబ్బులన్నీ అదానీకి వెళ్తున్నాయి” అని రాహుల్ మండిపడ్డారు.