ఎస్పీ గూండా రాజ్​ను యూపీ ఓటర్లు ఒప్పుకోరు

ఎస్పీ గూండా రాజ్​ను యూపీ ఓటర్లు ఒప్పుకోరు

కిసాన్ గంజ్/డెహ్రాడూన్: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ లపై ప్రధాని మోడీ మాటల దాడిని పెంచారు. యూపీ ప్రజలు ఎస్పీ గూండా రాజ్ పాలనను ఒప్పుకోరని, ఉత్తరాఖండ్ ప్రజలు కాంగ్రెస్ విభజన రాజకీయాలను తిప్పికొడతారని అన్నారు. శుక్రవారం యూపీలోని కిసాన్ గంజ్​లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ఎస్పీ నేతలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని, వాళ్లు ‘పరివార్ వాదీలు(కుటుంబవాదులు)’ అని విమర్శించారు. ‘‘తమ పడవ మునిగిందని ఎస్పీ నేతలు రియలైజ్ అయ్యారు. అప్పటినుంచి ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్​పై నిందలు వేయడం షురూ చేశారు. అసలు నిజమేంటంటే.. యూపీ ప్రజలు గూండా రాజ్ పాలనను అంగీకరించేందుకు సిద్ధంగా లేరు” అని ఆయన అన్నారు.  

‘విభజన-దోపిడీ’నే కాంగ్రెస్ ఫార్ములా
కాంగ్రెస్ పార్టీ కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ప్రజలను విభజిస్తోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. ‘అందరినీ విభజించుదాం.. కలిసి దోచుకుందాం’ అన్నదే ఆ పార్టీ ఫార్ములా అని విమర్శించారు. ఉత్తరాఖండ్ ప్రజలు ఆ పార్టీ విభజన రాజకీయాలను తిప్పికొడతారని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తరాఖండ్​లోని అల్మోరాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. బీజేపీకి మరోసారి అధికారం ఇస్తే.. రాష్ట్రంలో హిమాలయాలంత అభివృద్ధిని చేసి చూపిస్తుందన్నారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు చేపట్టామని, కుమావ్ రీజియన్​లో రూ.17 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని మోడీ గుర్తుచేశారు. వీటితో రాష్ట్రంలో టూరిజం మరింత డెవలప్ అవుతుందని, బార్డర్ విలేజెస్​లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరుగుతుందన్నారు.