మోడీ వేసుకున్న కోటు పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో చేసింది

మోడీ  వేసుకున్న కోటు పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో చేసింది

డ్రెస్సింగ్ విషయంలో ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రాంతాన్ని, సందర్భాన్ని బట్టి వేషధారణను ఫాలో కావడం మోడీకేం కొత్త కాదు. అందుకే ఆయన ఎక్కడికెళ్లినా.. అందరి చూపూ ఆయన డ్రెస్సింగ్ పైన కూడా ఉంటుందనడంలో సందేహమేమీ లేదు. దాంతో పాటు ఆయన వేసుకున్న డ్రెస్సుకు కూడా ప్రాధాన్యత ఉండడం చెప్పుకోదగిన విషయం. అయితే తాజాగా పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలకు హాజరైన ప్రధాని మోడీ నీలం రంగు జాకెట్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అందులో ప్రత్యేకతేముంది అనుకుంటున్నారా.. ఈ జాకెట్‌ నిజంగానే ప్రత్యేకమైనది. ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైకిల్‌ చేసి దీన్ని తయారు చేశారట. 

బెంగళూరులో జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్‌ 2023’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, ప్రధానికి అరుదైన బహుమతిని అందజేసింది. అదే పీఈటీ‌(పాలీఇథలిన్‌ టెరెఫ్తలేట్‌) బాటిళ్లను రీసైకిల్‌ చేసి తయారు చేసిందే ఈ నీలం రంగు జాకెట్‌. ఆ జాకెట్‌నే ప్రధాని ధరించి, పార్లమెంట్‌కు వచ్చారు. అప్పట్లో మధ్య మహాబలిపురంలో స్వయంగా చీపురు చేత బట్టి బీచ్‌ను శుభ్రం చేసిన ప్రధాని.. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక తాజాగా ‘బ్లూ జాకెట్‌’తో హరిత సందేశమిచ్చారు. ‘హరిత వృద్ధి’ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మోడీ సర్కారు.. ఇటీవలే రూ.19,700 కోట్లతో నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను ప్రారంభించింది.