ఎన్నికల్లో పోటీకి భయపడి రాజ్యసభకు పోతున్నరు

ఎన్నికల్లో పోటీకి భయపడి రాజ్యసభకు పోతున్నరు
  •     కాంగ్రెస్ నేతలపై ప్రధాని మోదీ ఎద్దేవా
  •     బిహార్​లో కాంగ్రెస్-ఆర్జేడీని సాగనంపాం
  •     అభివృద్ధి చేస్తూ.. శాంతిని నెలకొల్పామని కామెంట్స్
  •     బిహార్ లో రూ. 21,400 కోట్ల పనులు ప్రారంభించిన పీఎం

ఔరంగాబాద్ (బిహార్): కుటుంబ, వారసత్వ రాజకీయాలను నడిపే నేతలు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సైతం భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే వారు రాజ్యసభ ద్వారా పార్లమెంట్ లోకి ఎంటరవుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం బిహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన పబ్లిక్ ర్యాలీలో మోదీ మాట్లాడారు. బిహార్ లో మళ్లీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిందని.. కుటుంబ, వారసత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మనసుల్లో భయాందోళనలు సృష్టించిన వారిని సాగనంపిందంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్– ఆర్జేడీ కూటమిని ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. ‘‘బిహార్ లో అభివృద్ధి ఊపందుకున్నది. శాంతి భద్రతలు మెరుగయ్యాయి. మహిళలు భయం లేకుండా తిరుగుతున్నారు. ఇదే మోదీ గ్యారంటీ” అని ప్రధాని చెప్పారు. గతంలో ఇక్కడి యువత భయంతో బతికేవారని, ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సి వచ్చేదన్నారు. 

ఇప్పుడు ఆ పరిస్థితులు మళ్లీ రానివ్వబోమన్నారు. “బిహార్ సీతా దేవి పుట్టిన గడ్డ. అయోధ్యలో రాముడి గుడి ప్రారంభం సందర్భంగా ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషించారు. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడం మొత్తం రాష్ట్రానికే దక్కిన గౌరవం” అని మోదీ అన్నారు. కాగా, బిహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని రూ. 1.62 లక్షల కోట్లతో చేపట్టిన గ్యాస్ సెక్టార్ ప్రాజెక్టులను ప్రారంభించారు. బిహార్ తోపాటు హర్యానా, ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులను మోదీ వర్చువల్ గా ఆవిష్కరించారు. వీటితోపాటు నాలుగు ఎక్స్ ప్రెస్ ట్రెయిన్లను కూడా జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు. 

ఇకపై ఎప్పటికీ ఎన్డీఏలోనే ఉంటా: నితీశ్ కుమార్ 

ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ర్యాలీలో బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మీరు (మోదీ) గతంలో కూడా బిహార్ కు అనేక సార్లు వచ్చారు. అప్పుడు నేను కొంతకాలం ఎన్డీఏలో లేను. ఇప్పుడు నేను మీకు హామీ ఇస్తున్నా. ఇకపై ఎప్పటికీ ఎన్డీఏలోనే ఉంటాను” అని అన్నారు.  

రూ. 21,400 కోట్ల పనులు ప్రారంభం..

బిహార్​లో రూ.21,400 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రధాని మోదీ శనివారం ఔరంగాబాద్ జిల్లా రతన్వా గ్రామం వద్ద జరిగిన సభలో ప్రారంభించారు. ఇందులో రూ.18 వేల కోట్లతో చేపట్టిన 3 నేషనల్ హైవే ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే గంగా నదిపై ఆరు లేన్ల బ్రిడ్జికి ప్రధాని శంకుస్థాపన చేశారు. నమామి గంగే ప్రాజెక్టు కింద రూ.2,190 కోట్లతో చేపట్టిన 12 ప్రాజెక్టులను ప్రారంభించారు. పాట్నాలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యూనిటీ మాల్​కూ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం నితీశ్ కుమార్ పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 

టీఎంసీ అంటే.. తూ, మై ఔర్ కరప్షన్..

బిహార్ పర్యటనకు ముందు బెంగాల్​లోని నదియా జిల్లా క్రిష్ణానగర్​లో జరిగిన ర్యాలీ లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో టీఎంసీ అవినీతి, అణచివేత పాలన సాగిస్తోందని ఫైర్ అయ్యారు. టీఎంసీ అంటే.. ‘తూ, మై ఔర్ కరప్షన్ (నీవు, నేను, అవినీతి)’ అంటూ భాష్యం చెప్పారు. సందేశ్ ఖాలీలో మహిళలపై టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్ వేధింపులను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళలను పట్టించుకోకుండా నిందితుడికే కొమ్ము కాసిందన్నారు. రాష్ట్రంలో 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 18 సీట్లు ఇచ్చారని.. ఈసారి రాష్ట్రంలోని 42 సీట్లలో బీజేపీనే గెలిపించాలన్నారు.