కొత్త శకానికి నాంది: ప్రధాని మోదీ

కొత్త శకానికి నాంది:  ప్రధాని మోదీ
  •     రాముడు ఇకపై టెంట్​లో కాదు.. గొప్ప ఆలయంలో ఉంటడు :  ప్రధాని మోదీ
  •     వచ్చే వెయ్యేండ్లలో బలమైన, గొప్ప, దైవిక భారతావనికి పునాది వేయాలి
  •     దేవుడి నుంచి దేశం వరకు ప్రజల చైతన్యం విస్తరించాలి
  •     అయోధ్యలో ఆలయం నిర్మిస్తే దేశం తగలబడుతుందని కొందరన్నరు
  •     రాముడు నిప్పు కాదు శక్తి.. వివాదం కాదు పరిష్కారం!
  •     భారత దేశ యూనిటీకి ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని కామెంట్

అయోధ్య : రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన ఒక కొత్త శకానికి ఆరంభమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే వెయ్యేండ్లలో బలమైన, గొప్ప, దైవిక భారతదేశానికి పునాది వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆలయ ప్రాంగణంలో దాదాపు 36 నిమిషాలపాటు ఆయన మాట్లాడారు. సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన ఇండియాకు రామ మందిరం సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. 

‘‘ఆలయ గర్భగుడిలో దివ్య చైతన్యాన్ని వీక్షిస్తూ మీ ముందుకు వచ్చాను. ఎంతో సహనం.. ఎన్నో త్యాగాలు.. మరెంతో తపస్సు చేసిన తర్వాత ఈ రోజు మన రాముడు వచ్చాడు.. ఎన్నో ఏండ్ల ఎదురుచూపుల తర్వాత మన రాముడు వచ్చాడు. రామ్ లల్లా ఇకపై గుడిసెలో ఉండాల్సిన అవసరం లేదు. అత్యద్భుత ఆలయంలో ఉంటాడు” అని చెప్పారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కలిగిన డివైన్ వైబ్రేషన్స్‌‌ను తాను ఇప్పటికీ అనుభూతి చెందుతున్నానని చెప్పారు. ఈ రోజు రామ్ లల్లా విగ్రహానికి మాత్రమే ప్రాణ ప్రతిష్ఠ జరగలేదని, భారత దేశ యూనిటీకి కూడా ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని అన్నారు. 

ఆలస్యానికి క్షమించు రామయ్యా

‘‘శ్రీరాముడిని క్షమాపణలు కోరుతున్నా.. ఇంత కాలం ఈ పనిని (ఆలయ నిర్మాణం) పూర్తి చేయలేకపోవడానికి మన తపస్సులోనే కొన్ని లోపాలు ఉన్నాయోమో. ఆ లోపాన్ని అధిగమించాం. రాముడు మనల్ని క్షమిస్తారని నాకు నమ్మకం ఉంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో మొత్తం ప్రపంచమే కనెక్ట్ అయిందని అన్నారు. ‘‘రాముడు.. భారతదేశ విశ్వాసం, భారతదేశానికి ఆధారం.

 ఆయన దేశ చైతన్యం.. గర్వం.. కీర్తి. ఆయన విగ్రహ ప్రతిష్ఠాపన ప్రభావం శతాబ్దాలు కాదు.. వేల సంవత్సరాల వరకు ఉంటుంది. వెయ్యేండ్ల తర్వాత కూడా మనం దేశ నిర్మాణం కోసం చేసిన పనులను జనం గుర్తుంచుకుంటారు” అని చెప్పారు. రామ మందిరాన్ని నిర్మిస్తే దేశం తగలబడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారని మోదీ అన్నారు. భారతదేశ సామాజిక స్ఫూర్తిలోని స్వచ్ఛతను అలాంటి వ్యక్తులు అర్థం చేసుకోలేరని విమర్శించారు. 

‘‘ఈ ఆలయ నిర్మాణం.. సమాజంలో శాంతి, సహనం, పరస్పర సామరస్యం, మైత్రికి ప్రతీక. ఈ నిర్మాణం ఎలాంటి అగ్గికి ఆస్కారం ఇవ్వడం లేదు.. కానీ శక్తిని ఇస్తున్నది. వీటిని అర్థం చేసుకోలేని వ్యక్తులు పునరాలోచించాలని నేను కోరుతున్నా’’ అని వివరించారు. ‘‘ఒకప్పుడు రాముడి ఉనికే ప్రశ్నార్థకమైంది. కానీ మన రాజ్యాంగంలోని తొలి పేజీలోనే శ్రీరాముడు ఉన్నాడు. చట్టం గౌరవాన్ని కాపాడినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. చట్టానికి లోబడే రామ మందిరం నిర్మాణం జరిగింది” అని తెలిపారు. శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించుకున్నామని, దేవుడి నుంచి దేశం వరకు, రాముడి నుండి రాష్ట్ర (దేశం) వరకు ప్రతి పౌరుడి చైతన్యం విస్తరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.