తెలుగులో మాట్లాడిన మోడీ.. సభలో కేరింతలు

తెలుగులో మాట్లాడిన మోడీ.. సభలో కేరింతలు

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించిన ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. అనంతరం బహిరంగ సభలో మోడీ తెలుగులో స్పీచ్ మొదలు పెట్టారు. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో 70 నియోజకవర్గాల్లోని రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. వారందరికీ స్వాగతం అంటూ అభినందనలు తెలిపారు. రామగుండం ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇప్పుడు జాతికి అంకితం చేశామన్నారు. లక్ష్యాలు పెద్దగా ఉన్నప్పుడు సరికొత్త పద్ధతులను అవలంభించాలని మోడీ అన్నారు. మన దేశం ఎరువుల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడిందని.. యూరియా కోసం ఉన్న పరిశ్రమల్లో టెక్నాలజీ పాతవి కావడం వల్ల మూతపడ్డాయన్నారు. అందులో ఒకటి రామగుండం అని చెప్పారు.  ఖరీదైన యూరియా విదేశాల నుంచి వచ్చినా రైతులకు చేరకుండా పరిశ్రమలకు దొంగతనంగా చేరవేశారన్నారు. దానివల్ల రైతులు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందని అన్నారు. 2014లో 100 శాతం ఎరువుల అక్రమ రవాణాను కేంద్ర ప్రభుత్వం ఆపగలిగిందని అన్నారు.  

త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా  భారత్ : మోడీ

గత రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోందని... మరోవైపు యుద్ధాలు, మిలటరీ యాక్షన్స్ ప్రభావం కూడా ప్రపంచం, మన దేశంపైనా పడుతోందన్నారు. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితుల మధ్య కూడా ఇంకో విషయం ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. భారత్ త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుందని నిపుణులు అంటున్నారని చెప్పారు.1990 తర్వాత 30 ఏళ్లలో జరిగిన వృద్ధి ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లోనే అవుతుందని నిపుణులు అంటున్నారని తెలిపారు.