మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంపులు

 మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంపులు

 

  •     మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం రేపటి నుంచి హెల్త్ క్యాంపులు
  •     స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకం ప్రారంభిస్తున్న కేంద్రం
  •     హెల్త్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖల సంయుక్త నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: మహిళలలో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్ లో ప్రారంభించనున్నారు. మన రాష్ట్రంలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు కలిసి ఈ హెల్త్ క్యాంపుల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోషణ మాసం కార్యక్రమం కూడా ఈ క్యాంపుల్లోనే కలిపేయనున్నారు. అమీర్ పేటలో మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వరకు 15 రోజులపాటు ఈ క్యాంపులను పీహెచ్​సీలు మొదలు బోధనాసుపత్రుల వరకు ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, గర్భవతులు, బాలింతలు, చిన్నారులు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

బీపీ నుంచి క్యాన్సర్ టెస్టుల దాకా... 

బుధవారం నుంచి నిర్వహించనున్న ఈ క్యాంపుల్లో మహిళలకు సంబంధించి దాదాపు అన్ని అనారోగ్య సమస్యలకు స్క్రీనింగ్ టెస్టులతో పాటు, మందులు కూడా అందించనున్నారు. డయాబెటీస్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, టీబీ, సికిల్ సెల్ డిసీస్ కి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఎనీమియాకు స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించి మహిళలకు అవగాహన కల్పించనున్నారు. వీటితో పాటు  గైనిక్, పీడియాట్రిక్స్, ఈఎన్​టీ, డెంటల్, సైకియాట్రీ, డెంటల్ వంటి స్పెషలిస్ట్ సేవలు కూడా అందించనునన్నారు. మదర్ అండ్ చైల్డ్ కేర్ కు సంబంధించి కార్డులు కూడా పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రంలో 20 వేలకు పైగా  హెల్త్ క్యాంపులు

రాష్ట్రంలో పీహెచ్​సీలు, యూపీహెచ్​సీలు, ఎస్ హెచ్​లు మొదలు.. జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలలో మొత్తం 20,607 క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. టీచింగ్ ఆసుపత్రుల్లో 564, టీవీవీపీ ఆసుపత్రుల్లో 2,148, పీహెచ్​సీలు, యూపీహెచ్​సీలలో 3,159 స్పెషలిస్ట్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. 3,206 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లు, 478 బస్తీ దవాఖానల్లో 14,736 స్క్రీనింగ్ క్యాంపులు 15 రోజుల పాటు నిర్వహించనున్నారు. అలాగే, ప్రతి జిల్లాకో మెగా క్యాంప్ చొప్పున 33 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు.