వ్యాక్సిన్ కోసం హైదరాబాద్ కు మోడీ

వ్యాక్సిన్ కోసం హైదరాబాద్ కు మోడీ
  •     తయారీ నుంచి పంపిణీ దాకా రివ్యూ
  •     ఇయ్యాల హైదరాబాద్​, అహ్మదాబాద్​, పుణె టూర్​
  •     భారత్​ బయోటెక్​, జైడస్​, సీరమ్​ ప్లాంట్ల పరిశీలన
  •     టీకా తయారీ ప్రోగ్రెస్​ తెలుసుకోనున్న ప్రధాని
  •     గంట పాటు భారత్​ బయోటెక్​​లో వ్యాక్సిన్​పై రివ్యూ

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్​ను వీలైనంత తొందరగా జనానికి అందించడంపై ప్రధాని నరేంద్ర మోడీ నజర్​ పెట్టారు. అందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. ట్రయల్స్​ దగ్గర్నుంచి, తయారీ, పంపిణీ వంటి విషయాలపై రివ్యూ చేస్తున్నారు. వ్యాక్సిన్ల ట్రయల్స్​, తయారీ ఎంత వరకు వచ్చిందో తెలుసుకుంటున్నారు. దాని కోసమే శనివారం అహ్మదాబాద్​, పుణె, హైదరాబాద్​కు వెళ్తున్నారు. ఆ మూడు చోట్ల వ్యాక్సిన్​ తయారీ ప్లాంట్లకు వెళ్లి టీకాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోబోతున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం ప్రధాని ఆఫీస్​ అధికారికంగా టూర్​ వివరాలను వెల్లడించింది. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మూడు సిటీలకు వెళ్తున్నారు. అహ్మదాబాద్​లోని జైడస్​ బయోటెక్​ పార్క్​, హైదరాబాద్​లోని భారత్​ బయోటెక్​, పుణెలో ఉన్న సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా ప్లాంట్లను పరిశీలిస్తారు’’ అని ట్వీట్​ చేసింది.కరోనాతో ఫైట్​లో భాగంగా నిర్ణయాత్మక ఫేజ్​లోకి ఇండియా ఎంటరైందని, దీంతో ఆయా కంపెనీల సైట్లను పరిశీలించి, వ్యాక్సిన్​ తయారీపై సైంటిస్టులతో మాట్లాడతారని పేర్కొంది. టీకా ప్రిపరేషన్, చాలెంజెస్​, పంపిణీకి సంబంధించిన రోడ్​మ్యాప్‌‌ను ప్రధానికి సైంటిస్టులు వివరిస్తారని చెప్పింది.

మార్చి నాటికి జైడస్​ వ్యాక్సిన్​

టూర్​లో భాగంగా ప్రధాని మోడీ శనివారం ఉదయం 9.30 గంటలకు గుజరాత్​లోని అహ్మదాబాద్​కు వెళతారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంగోదర్​ ఇండస్ట్రియల్​ ఏరియాలోని జైడస్​ క్యాడిలా ప్లాంట్​ను సందర్శిస్తారు. జైకొవ్​– డీ వ్యాక్సిన్​ను ఆ కంపెనీ తయారు చేస్తున్నది. ఆగస్టులోనే ఫేజ్​2 ట్రయల్స్​ మొదలయ్యాయి. ఆ ట్రయల్స్​ కూడా  పూర్తయ్యాయి. వెయ్యి మందిపై చేసిన ట్రయల్స్​ రిజల్ట్స్‌‌ వచ్చే వారం విడుదల చేయనుంది. వ్యాక్సిన్​ సేఫ్టీ, ఎఫికసీ బాగుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు మూడో దశ ట్రయల్స్​కు సంస్థ రెడీ అవుతోంది. 39 వేల మందిపై డిసెంబర్​ నుంచి ట్రయల్స్​ మొదలు పెట్టనుంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది మార్చి నాటికి టీకాను తీసుకొచ్చేందుకు ప్లాన్‌‌ చేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. 10 కోట్ల డోసులను తయారు చేస్తామని కంపెనీ చైర్మన్​ పంకజ్​ ఆర్​ పటేల్​ చెప్పారు.

45 రోజుల్లో సీరమ్​ టీకా!

జైడస్​ క్యాడిలా ప్లాంట్​ సందర్శన తర్వాత ప్రధాని అక్కడి నుంచి నేరుగా పుణేలోని సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ప్లాంట్​కు చేరుకుంటారు. ఆక్స్​ఫర్డ్​– ఆస్ట్రాజెనికా టీకాను ఇండియాలో ఉత్పత్తి చేసేందుకు సీరమ్​ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని 17 సైట్లలో టీకా కొవిషీల్డ్​పై మూడో ఫేజ్​ ట్రయల్స్​ నడుస్తున్నాయి. ఇటీవల ఆక్స్​ఫర్డ్​ విడుదల చేసిన ఇంటరిమ్​ డేటా అనాలిసిస్​ ప్రకారం.. 60 నుంచి 70 శాతం వరకు టీకా ప్రభావం ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే మరింత కట్టుదిట్టంగా ట్రయల్స్​ చేయాలని సీరమ్​ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, టీకా ఎఫెక్ట్​ 60 నుంచి 70 శాతం ఉన్నా వ్యాక్సిన్​ను వేసుకోవచ్చని, వైరస్​పై టీకా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. వివిధ వయసుల వారిపై ట్రయల్స్​ చేస్తున్నందున ఫలితాలు ఇలా వచ్చాయని, భయపడకుండా కాస్త ఓపికతో వేచి చూడాలని కోరింది. కాగా, టీకాను 45 రోజుల్లో మార్కెట్​ చేసేందుకు వీలుగా ‘ఎమర్జెన్సీ మార్కెటింగ్​ ఆథరైజేషన్​’ ఇవ్వాలని కోరుతూ సెంట్రల్​ డ్రగ్స్​ స్టాండర్డ్​ కంట్రోల్​ ఆర్గనైజేషన్​కు అప్లికేషన్​ పెడతామని 4 రోజుల క్రితం కంపెనీ చైర్మన్​ సైరస్​ పూనావాలా చెప్పారు. వ్యాక్సిన్​ ఫుల్​ డోస్​ (2 డోసులు)కు అనుమతులు పొందిన ఒకే ఒక్క కంపెనీ సీరమ్​ అని, కాబట్టి ఎమర్జెన్సీ అప్రూవల్​ వస్తే ఫుల్​ డోసును వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సగం డోస్​నే వేస్తామంటే కచ్చితంగా ‘హాఫ్​ డోస్​ ట్రయల్స్​’ చేయాల్సి ఉంటుందని అన్నారు.

భారత్​ బయోటెక్​ కొవ్యాగ్జిన్​ రిజల్ట్స్​ బాగున్నయ్​

కరోనాకు ఫస్ట్​ దేశీ వ్యాక్సిన్​ కొవ్యాగ్జినే కావడం విశేషం. హైదరాబాద్​లోని భారత్​బయోటెక్​ కంపెనీ దానిని అభివృద్ధి చేసింది. శనివారం పుణే నుంచి నేరుగా ప్రధాని మోడీ జీనోమ్​ వ్యాలీలోని భారత్​బయోటెక్​ ప్లాంట్​కు చేరుకుంటారు. అక్కడ వ్యాక్సిన్​ తయారీ తీరుతెన్నులను తెలుసుకుంటారు. గంట సేపు అక్కడే ఉంటారు. ప్రస్తుతం కొవ్యాగ్జిన్​కు సంబంధించి థర్డ్​ ఫేజ్​ ట్రయల్స్​ నడుస్తున్నాయి. టీకా ప్రభావాన్ని తెలుసుకునేందుకు 26 వేల మందిపై దానిని టెస్ట్​ చేస్తున్నారు. ట్రయల్స్​లో టీకా పనితీరు బాగున్నట్టు ఆ ట్రయల్స్​ చేస్తున్న డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్​, ఢిల్లీ, ముంబైల్లో ట్రయల్స్​ నడుస్తున్నాయి. గురువారమే అహ్మదాబాద్​లోనూ మొదలయ్యాయి. సోలా సివిల్​ హాస్పిటల్​లో ఐదుగురికి ప్రాథమికంగా టీకా వేశారు. శుక్రవారం మరో పది మందికి ఇచ్చారు. మరింత మంది వలంటీర్లు టీకా ట్రయల్స్​కు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం టీకా తీసుకున్న వలంటీర్లలో చెడు ప్రభావాలు కనిపించలేదని హాస్పిటల్​ మెడికల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​  చెప్పారు. కోల్​కతాలోనూ ట్రయల్స్​ చేయనుంది కంపెనీ. వెయ్యి మంది వలంటీర్ల కోసం వేచి చూస్తోంది.

హెటిరోలోనూ స్పుత్నిక్​ టీకా తయారీ

హైదరాబాద్​: స్పుత్నిక్​V టీకాలను మన దేశంలో వీలైనంత ఎక్కువగా తయారు చేసేందుకు రష్యా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే డాక్టర్​ రెడ్డీస్​తో ఒప్పందం చేసుకున్న రష్యా డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​(ఆర్​డీఐఎఫ్​).. తాజాగా హైదరాబాద్​కే చెందిన హెటిరోతోనూ జట్టుకట్టింది. 10 కోట్ల డోసులను తయారీకి అగ్రిమెంట్​ చేసుకున్నట్టు ఆర్​డీఐఎఫ్​ ప్రకటించింది. స్పుత్నిక్​ టీకాలను వీలైనంత ఎక్కువగా తయారు చేస్తామని, ఇండియా ప్రజలకు అందిస్తామని ఆర్​డీఐఎఫ్​ సీఈవో కిరిల్​ దిమిత్రీవ్​ చెప్పారు. లోకల్​గా వ్యాక్సిన్​ను తయారు చేయడం ద్వారా ప్రజలకు వేగంగా టీకాను అందించొచ్చని హెటిరో ల్యాబ్స్​ ఇంటర్నేషనల్​ మార్కెటింగ్​ డైరెక్టర్​ బి. మురళీ కృష్ణా రెడ్డి చెప్పారు.