- జనని జయకేతనం
- ఇండియాదే విమెన్స్ వన్డే వరల్డ్ కప్ కిరీటం
- ఫైనల్లో సౌతాఫ్రికాపై అద్భుత విజయం
- అదరగొట్టిన షెఫాలీ, దీప్తి శర్మ
- తొలి ఐసీసీ ట్రోఫీతో హర్మన్‌సేన కొత్త చరిత్ర
నవీ ముంబై: నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాలుగా గుండెలను పిండేస్తున్న ఆ వేదనకు విముక్తి లభించింది. గతంలో తుది మెట్టుపై చిందిన కన్నీటి చుక్కలన్నీ నేడు ఆనందభాష్పాలుగా మారాయి. ఎన్నో ఏండ్ల కలను సాకారం చేసుకున్న ఇండియా అమ్మాయిల జట్టు ఎట్టకేలకు జగజ్జేతగా అవతరించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (78 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87; 2/36), దీప్తి శర్మ (58 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 58; 5/39) ఆల్‌రౌండ్ మెరుపులతో ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా 52 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 298/7 స్కోరు చేసింది. షెఫాలీ, దీప్తికి తోడు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (58 బాల్స్‌లో 8 ఫోర్లతో 45), రిచా ఘోష్ (24 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34) విలువైన రన్స్ అందించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబోం ఖాకా 3/58) మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఛేజింగ్‌లో సఫారీ టీమ్ 45.3 ఓవర్లలో 246 రన్స్‌కే ఆలౌటై ఓడింది. కెప్టెన్ లారా వోల్‌వార్ట్ (98 బాల్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 101) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్, దీప్తికి ప్లేయర్ అఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.
ఓపెనింగ్ అదుర్స్
వాన కారణంగా రెండు గంటల ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు షెఫాలీ, మంధాన తొలి వికెట్‌కు 104 రన్స్ జోడించి అద్భుతమైన పునాది వేశారు. సూపర్ ఫామ్‌లో ఉన్న మంధాన తన ట్రేడ్‌మార్క్ కట్, స్వీప్ షాట్లు, డ్రైవ్స్‌తో అలరించింది. తొలి ఓవర్ మెయిడిన్ అవగా.. మరో ఓపెనర్ షెఫాలీ ఫోర్‌తో ఇండియా ఖాతా తెరిచింది.
ప్రతీకా రావల్ గాయం కారణంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చి సెమీస్‌లో నిరాశ పరిచిన ఫెఫాలీ ఫైనల్లో ఎంతో పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడింది. దూకుడైన షాట్లతో పాటు మంధానతో కలిసి స్ట్రయిక్ రొటేట్ చేస్తూ పర్ఫెక్ట్ ప్లేయర్‌ను తలపించింది. మరిజేన్ కాప్ బౌలింగ్‌లో షెఫాలీ, ఖాకా ఓవర్లో మంధాన వరుసగా రెండేసి బౌండ్రీలతో వేగం పెంచారు. వీళ్ల జోరుకు 6.3 ఓవర్లకే స్కోరు ఫిఫ్టీ దాటింది.
స్పిన్నర్ ఎంలబా కాస్త కట్టడి చేసినా.. డిక్లెర్క్ వేసిన 15వ ఓవర్లో క్లాసిక్ సిక్స్‌తో ఇన్నింగ్స్‌కు మళ్లీ జోష్ తెచ్చింది. మంధాన వెంటవెంటనే రెండు ఫోర్లతో స్కోరు వంద దాటించినా.. ట్రయాన్ వేసిన 18వ ఓవర్లో కట్ చేయబోయి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో సఫారీ టీమ్‌కు ఎట్టకేలకు బ్రేక్ లభించింది.
అదే ఓవర్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న షెఫాలీ 56 రన్స్ వద్ద ఇచ్చిన క్యాచ్‌ను బాష్ డ్రాప్ చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఓపెనర్.. సెమీస్ సెంచరీ స్టార్ జెమీమా (24) తోడుగా జోరు కొనసాగించింది. సునే లూస్ వేసిన 25వ ఓవర్లో స్ట్రెయిట్ సిక్స్‌తో స్కోరు 150 దాటించింది. అయితే సెంచరీ చేసేలా కనిపించిన షెఫాలీ ఖాకా వేసిన 28వ ఓవర్లో మరో షాట్‌కు ట్రై చేసి మిడాఫ్‌లో సునే లూస్‌కు క్యాచ్ ఇచ్చింది.
దీప్తి, రిచా పోరాటం
మంచి పునాది వేసిన ఓపెనర్లు ఔటైన తర్వాత జెమీమా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, సఫారీ బౌలర్లు పుంజుకున్నారు. జెమీమాను కవర్స్‌లో వోల్‌వార్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో ఖాకా వెనక్కుపంపింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్.. దీప్తి శర్మతో కలిసి 52 రన్స్ జోడించింది. కానీ, గేరు మార్చాల్సిన సమయంలో ఎంలబా స్పిన్‌ను అంచనా వేయడంలో విఫలమై కౌర్ క్లీన్ బౌల్డ్ అయ్యింది.
ఆ వెంటనే అమన్‌జోత్ కౌర్ (12)ను డిక్లెర్క్ రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేయడంతో ఇండియా 254/5తో నిలిచింది. అయితే, స్లాగ్ ఓవర్లలో దీప్తి అద్భుతంగా పోరాడింది. స్వీప్, కట్ షాట్లతో అలరించింది. తన రెండో బాల్‌కే సిక్స్ కొట్టిన రిచా ఘోశ్ కూడా భారీ షాట్లతో ఆకట్టుకుంది. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 35 బాల్స్‌లోనే 47 రన్స్ జోడించి జట్టుకు మంచి స్కోరు అందించారు.
వోల్‌వార్ట్ వంద.. వదలని వర్మ–శర్మ
టార్గెట్ ఛేజింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికాను ఇండియా బౌలర్లు ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టారు. కొత్త బాల్‌తో రేణుక, క్రాంతి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి ఐదు ఓవర్లలో 18 రన్స్ మాత్రమే వచ్చాయి. కానీ, రేణుక బౌలింగ్‌లో సిక్స్‌తో తజ్మిన్ బ్రిట్స్ (23) గేరు మార్చగా.. ఎనిమిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అమన్‌జోత్‌కు కెప్టెన్ వోల్‌వార్ట్ రెండు ఫోర్లతో స్వాగతం పలికింది. అయితే పదో ఓవర్లో అమన్‌జోత్.. మెరుపు త్రోతో తజ్మిన్‌ను రనౌట్ చేయడంతో సఫారీల పతనం మొదలైంది. 12వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన తెలుగమ్మాయి శ్రీచరణి బాష్ (0)ను ఎల్బీ చేయడంతో ప్రత్యర్థికి మరో షాక్ తగిలింది.
అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న వోల్‌వార్ట్.. సునే లూస్ (25) తోడుగా జోరు కొనసాగించగా 20 ఓవర్లకు సఫారీ టీమ్ 113/2తో పటిష్టంగా కనిపించింది. ఇక్కడే హర్మన్ కెప్టెన్సీ మ్యాజిక్ చేసింది. పార్ట్‌టైమ్ స్పిన్నర్ షెఫాలీ వర్మకు బాల్ అప్పగించింది. నమ్మకాన్ని నిలబెట్టిన షెఫాలీ తన రెండో బాల్‌కే సునే లూస్‌ను రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసి కీలక బ్రేక్ ఇచ్చింది. తన తర్వాతి ఓవర్లో లెగ్ సైడ్ వెళ్తున్న బాల్‌ను వెంటాడిన మరిజేన్ కాప్ (4) కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో సౌతాఫ్రికా 123/4తో ఒక్కసారిగా డీలా పడింది. రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లను ప్రయోగించడంతో ప్రొటీస్ రన్‌రేట్ పడిపోయింది.
క్రీజులో తడబడిన సినలో జాఫ్నా (16)ను 30వ ఓవర్లో పెవిలియన్ చేర్చిన దీప్తి సఫారీలను 148/5తో మరింత కష్టాల్లోకి నెట్టింది. కానీ, వోల్‌వార్ట్‌కు తోడైన డెర్క్‌సెన్ (35) వరుసగా రెండు సిక్సర్లతో ఛేజింగ్‌కు ఒక్కసారిగా ఊపు తెచ్చింది. తర్వాతి ఓవర్లో ఇండియా తొలుత డెర్క్‌సెన్ క్యాచ్‌ను డ్రాప్ చేసిన దీప్తి శర్మ.. 40వ ఓవర్లో ఆమెను అద్భుతమైన యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేసింది.
చివరి పది ఓవర్లలో సఫారీలకు 88 రన్స్ అవసరం అవగా అప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న కెప్టెన్ వోల్‌వార్ట్ క్రీజులో ఉండటంతో ఆ టీమ్ ఆశలు కోల్పోలేదు. కానీ, దీప్తి వేసిన తర్వాతి ఓవర్లోనే అమన్‌జోత్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌తో వోల్‌వార్ట్ పెవిలియన్ చేరడంతో ఇండియా విజయం ఖాయమైంది. అదే ఓవర్లో ట్రయాన్ (9) ఎల్బీ అవ్వగా.. దీప్తి బౌలింగ్‌లో డిక్లెర్క్ (18) ఇచ్చిన క్యాచ్‌ను హర్మన్ ఒంటిచేత్తో పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌తో ఇండియా విజయ సంబరాలు మొదలయ్యాయి.
గేమ్ ఛేంజర్స్ వర్మ-శర్మ
ఇండియా విమెన్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఉద్వేగభరిత ఫైనల్లో షెఫాలీ వర్మ-దీప్తి శర్మ జట్టుకు జయ ద్వయంగా నిలిచారు. ఇద్దరూ ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆతిథ్య జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు. చాన్నాళ్లుగా నేషనల్ జట్టుకు దూరమైన షెఫాలీ వర్మ ఫైనల్ మ్యాచ్‌ను శాసించడం చూస్తుంటే కప్పును గెలిపించడానికి దేవుడు రాసిన స్క్రిప్ట్‌లా ఉంది.
సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రతీక రావల్‌కు గాయం కావడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షెఫాలీ, అదృష్టం కంటే పట్టుదలే ఎక్కువ అని నిరూపించింది. బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిన ఆమె, ఛేజింగ్ కీలక దశలో బౌలింగ్‌కు వచ్చి వెంటవెంటనే రెండు కీలక వికెట్లు పడగొట్టి.. అసలైన 'గేమ్ ఛేంజర్' అని నిరూపించుకుంది. ఇక, దీప్తి శర్మ ఆల్‌రౌండర్‌కు అసలు నిర్వచనం చెప్పింది.
మిడిలార్డర్ బ్యాటింగ్ బాధ్యతను భుజాలపై వేసుకున్న ఆమె షెఫాలీ వర్మ ఇచ్చిన మంచి పునాదిపై జట్టు భారీ స్కోరు చేసేందుకు బాటలు వేసింది. ఆపై బాల్‌తోనూ మెప్పించి సఫారీలను రెండు సందర్భాల్లో ఘోర దెబ్బకొట్టింది. మధ్యలో ఆరు బాల్స్ తేడాలో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థికి బ్రేకులు వేసిన ఆమె.. చివర్లో నాలుగు బాల్స్ తేడాలో వోల్‌వార్ట్, ట్రయాన్‌ను వెనక్కుపంపి విజయం ఖాయం చేసింది. ఆఖరి వికెట్ కూడా తనే తీసిన దీప్తి టోర్నీ మొత్తంలో టాప్ వికెట్ టేకర్ (22 వికెట్లు) గానే కాకుండా 215 రన్స్ చేసింది. తను ఆల్‌రౌండర్ మాత్రమే కాదు ఇండియా ‘విన్ రౌండర్’!
స్కోర్ బోర్డ్
ఇండియా: స్మృతి మంధాన (సి) జాఫ్తా , (బి) ట్రయాన్45, షెఫాలీ వర్మ (సి) సునే లూస్ (బి) ఖాకా 87, జెమీమా (సి) వోల్‌వార్ట్ (బి) ఖాకా 24, హర్మన్‌ప్రీత్ (బి) ఎంలబా 20, దీప్తి శర్మ (రనౌట్ ట్రయాన్/జాఫ్తా)58, అమన్‌జోత్ (సి అండ్ బి) డిక్లెర్క్ 12, రిచా ఘోష్ (సి) డెర్క్‌సెన్ (బి) ఖాకా 34, రాధా యాదవ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం 50 ఓవర్లలో 298/7; వికెట్ల పతనం: 1–104, 2–166, 3–171-, 4–223, 5–245, 6–292-, 7–298. బౌలింగ్: మరిజాన్ కాప్: 10–-1–-59–-0, అయబోంగా ఖాకా: 9–-0–-58–-3, ఎంలబా: 10–-0–-47–-1, డిక్లెర్క్: 9–-0–-52–-1, సునే లూస్: 5–-0–-34–-0, ట్రయాన్: 7–-0–-46-–1.
సౌతాఫ్రికా: వోల్‌వార్ట్ (సి) అమన్ (బి) దీప్తి 101, బ్రిట్స్ (రనౌట్/అమన్) 23, బాష్ (ఎల్బీ) శ్రీచరణి 0, లూస్ (సి అండ్ బి) షెఫాలీ 25, కాప్ (సి) రిచా (బి) షెఫాలీ 4, జాఫ్రా (సి) రాధా (బి) దీప్తి 16, డెర్క్‌సెన్ (బి) దీప్తి 35, ట్రయాన్ (ఎల్బీ) దీప్తి 9, డెక్లెర్క్ (సి) హర్మన్ (బి) దీప్తి 18, ఖాకా (రనౌట్)1, ఎంలబా (నాటౌట్)1;
ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 45.3 ఓవర్లలో 246 ఆలౌట్; వికెట్ల పతనం: 1–-51, 2-–62, 3-–114, 4-–123, 5-–148, 6–-209, 7--–220, 8–221, 9–246;
బౌలింగ్: రేణుక 8–0–28–0, క్రాంతి 3–0–16–0, అమన్‌జోత్ 4–034–0, దీప్తి 9.3–0–39–5, శ్రీచరణి 9–0–48–1, రాధా యాదవ్ 5–0–45–0, షెఫాలీ 7–0–36–2.
* 434.. ఈ టోర్నీలో మంధాన చేసిన మొత్తం రన్స్, ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక రన్స్ చేసిన ఇండియా బ్యాటర్‌గా మిథాలీ రాజ్ (2017లో 409 ) రికార్డు బ్రేక్ చేసింది.
* 12.. ఈ టోర్నీలో రిచా ఘోశ్ కొట్టిన సిక్సర్లు, ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొటిన ప్లేయర్‌గా వెస్టిండీస్ ప్లేయర్ దియేంద్ర డాటిన్ (2013లో 12) రికార్డును సమం చేసింది.
* 2.. ఈ మ్యాచ్‌లో ఇండియా చేసిన 298/7 స్కోరు విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెకండ్ హయ్యెస్ట్. 2022 ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆసీస్ 356/5 స్కోరు చేసింది.
* ఒక కల... దశాబ్దాలుగా ఊరిస్తున్న ఒక మహా స్వప్నం.. ఎట్టకేలకు సాకారమైంది.
* లెక్కలేనన్ని గుండెకోతలకు, ఫైనల్స్‌లో ఎదురైన కన్నీటి ఓటములకు తెరపడింది.
* 1983 జూన్ 25న కపిల్ దేవ్ లార్డ్స్ బాల్కనీలో కప్పు అందుకున్న దృశ్యం ఇండియా క్రికెట్ గతిని మార్చినట్టే
* 2025 నవంబర్ 2న నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియం గడ్డపై హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ప్రపంచ కిరీటాన్ని ముద్దాడింది.
* క్రికెట్ లెజెండ్స్ సచిన్, మిథాలీ రాజ్, రోహిత్ శర్మ సాక్షిగా.. వేలాది మంది అభిమానుల వందేమాతర నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోతుండగా..
* కోట్లాది మంది టీవీల ముందు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. క్రికెట్ మహా సంగ్రామంలో గెలిచిన మన మగువలు మహారాణులుగా నిలిచారు.
* ఫైనల్ ఒత్తిడిని చిరునవ్వుతో జయిస్తూ తొలిసారి తుదిపోరు చేరిన సౌతాఫ్రికాను ఉత్కంఠ పోరులో చిత్తుగా ఓడించారు.
* దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ను గర్వంగా అందుకున్నారు.
* కప్పు గెలిపించడానికి వచ్చినట్టు అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఓపెనర్ షెఫాలీ వర్మ, దీప్తి శర్మ బ్యాట్, బాల్‌తో విజృంభించిన వేళ..
* 2005, 2017, 2020 (టీ20 కప్)లో చివరి మెట్టుపై బోల్తా పడిన చేదు అనుభవాలను చెరిపేస్తూ.. అబ్బాయిలకేం తక్కువ కాదన్నట్టుగా నిరూపిస్తూ.. మన అమ్మాయిలు జగజ్జేతలుగా నిలిచారు. ఇది కేవలం ఒక క్రికెట్ విజయం కాదు.. దేశంలోని కోట్లాది అమ్మాయిల ఆశలకు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన చారిత్రక పట్టాభిషేకం.
