బీఆర్ఎస్కు కవిత ఫియర్.. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ గులాబీ పార్టీలో టెన్షన్.. హాట్ టాపిక్గా మారిన ఇష్యూ

బీఆర్ఎస్కు కవిత ఫియర్.. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ గులాబీ పార్టీలో టెన్షన్.. హాట్ టాపిక్గా మారిన ఇష్యూ
  • అస్త్రంగా మార్చుకుంటున్న కాంగ్రెస్​
  • ‘సొంత చెల్లెకే అన్యాయం చేసినోడు.. పక్కింటి ఆడబిడ్డకు ఏం న్యాయం చేస్తాడు’ అంటూ నిలదీతలు
  • ఆన్సర్​ చేయలేక కేటీఆర్​ తిప్పలు 
  • భవిష్యత్​లోనూ బీఆర్​ఎస్​కు కవిత ఇష్యూతో సమస్యేనంటున్న పొలిటికల్​ సర్కిల్స్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్​కు కవిత ఫియర్​ పట్టుకుంది. పార్టీని వీడినప్పటి నుంచి ఆమె చేస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా జిల్లాల పర్యటనల్లో వ్యక్తిగత అనుభవాలను జోడిస్తూ వెల్లడిస్తున్న విషయాలు గులాబీ పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్​ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కవిత అంశం ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది.

సీఎం రేవంత్​రెడ్డి ఈ అంశంపై ప్రచారంలో విస్తృతంగా మాట్లాడుతున్నారు. దీంతో కవిత ఇష్యూపై ఏ విధంగా స్పందించాలో తెలియక కేటీఆర్​ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. ఇప్పుడే కాకుండా బీఆర్ఎస్​ భవిష్యత్తు రాజకీయ అజెండాలోని ప్రతి అంశంలోనూ కవిత ప్రభావం కీలకంగా మారతుందని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్‌‌ఎస్‌‌లో కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​ తర్వాత కవిత అనేలా కనిపించిన ఆమె.. పార్టీని వీడటం, అసలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలపై ఇప్పుడు చేస్తున్న ఘాటైన వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత విభేదాలను, ఆధిపత్య పోరును ఇప్పటికే బట్టబయలు చేశాయి.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు  తనను ఎలా అణగదొక్కారో,  తనకు పార్టీలో జరిగిన అన్యాయమేమిటో తన పర్యటనల్లో పదే పదే కవిత ప్రస్తావిస్తున్నారు. ఆమె చేస్తున్న ఈ ఆరోపణలు కేవలం వ్యక్తిగత అంశాలుగా కాకుండా, మొత్తం బీఆర్‌‌ఎస్‌‌లో నిరంకుశ పోకడలు ఉన్నాయనడానికి నిదర్శనంగా మారాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిణామం బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా, సామాన్య ప్రజల్లోనూ ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని వారు చర్చించుకుంటున్నారు.

ఎలా స్పందించాలో తెలియక ఉక్కిరిబిక్కిరి
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్​ ప్రచారంలో కవిత అంశం కాంగ్రెస్‌‌కు రామబాణంలా మారింది. సీఎం రేవంత్‌‌ రెడ్డి ఈ అంశాన్ని ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ‘‘సొంత చెల్లెకే అన్యాయం చేసినోడు.. పక్కింటి ఆడబిడ్డకు ఏం న్యాయం చేస్తడు? పుట్టింటిపై ఆడబిడ్డ ఆరోపణలు చేయదు. ఎంత బాధ ఉన్నా తనలోని దిగమింగుకొని పుట్టింటి గౌరవాన్ని కాపాడుతుంది. కానీ, ఆ ఆడబిడ్డ బయటకు వచ్చి కన్నీళ్లు పెడ్తున్నదంటే.. ఆ దుర్మార్గులు ఎంత కష్టపెట్టారో ఆలోచించండి. సొంత చెల్లెకే అన్యాయం చేసినోళ్లకు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది?” అని సీఎం ప్రశ్నిస్తున్నారు. 

కవిత లాంటి కీలక నేతకే బీఆర్‌‌ఎస్‌‌లో అన్యాయం జరిగిందంటే, సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నను ఆయన లేవనెత్తుతూ బీఆర్‌‌ఎస్‌‌ నాయకత్వాన్ని ఇరుకునపడేస్తున్నారు. ఫలితంగా, ఉప ఎన్నిక బరిలో ఈ అంశం ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇక కవిత ఆరోపణలపై బీఆర్‌‌ఎస్‌‌ ముఖ్య నాయకులు, ముఖ్యంగా కేటీఆర్‌‌ ఎలా స్పందించాలో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది.

బహిరంగంగా ఆమె ఆరోపణలను ఖండిస్తే, అది కుటుంబ కలహాలను మరింత రోడ్డున పడేసినట్లు అవుతుందనే భయం.. మౌనంగా ఉంటే ఆ ఆరోపణలను అంగీకరించినట్లవుతుందనే పీటముడి కేటీఆర్‌‌ను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నదని గులాబీ శ్రేణులు అనుకుంటున్నాయి. కవితను కుటుంబ సభ్యురాలిగా భావించి సంయమనం పాటిస్తున్నామని కేటీఆర్‌‌ ఒక సందర్భంలో చెప్పినా.. ఆమె మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని జనం ముందు ఉంచుతున్నారు. అన్యాయాన్ని తాను భరించానని, అవమానం జరగడంతోనే బటయకు వచ్చానని చెప్తున్నారు. తమ అభ్యర్థి ఆడబిడ్డ అని, ఆమెను గెలిపించండంటూ కేటీఆర్​ జూబ్లీహిల్స్​ ప్రచారంలో చెప్తున్నప్పటికీ.. సొంత ఆడబిడ్డకే అన్యాయం చేసిన వ్యక్తి ఇతరులకు ఏం న్యాయం చేస్తారని కాంగ్రెస్​ నేతలు నిలదీస్తున్నారు. 

భవిష్యత్తులోనూ తిప్పలే !
బీఆర్‌‌ఎస్‌‌ను వీడిన తర్వాత కవిత కేవలం హైదరాబాద్‌‌కే పరిమితం కాకుండా, పలు జిల్లాల్లో చురుకుగా పర్యటిస్తున్నారు. తనను కలిసిన కార్యకర్తలు, అభిమానుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఎదురైన చేదు అనుభవాలను చెప్తున్నారు. ‘‘నేను చేసిన తప్పు కేవలం పార్టీకి కట్టుబడి ఉండటమే’’ అంటూ భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. తన భర్త ఫోన్​ను ​కూడా ట్యాప్​ చేశారనే విషయం తెలిసి కడుపు దేవినట్లయిందని అంటున్నారు. 

బీఆర్‌‌ఎస్‌‌ నుంచి నష్టపోయినట్లు భావిస్తున్న నాయకులను పర్యటనల్లో కవితల కలుస్తుండటం, వారికి మద్దతుగా నిలుస్తుండటం ద్వారా బీఆర్‌‌ఎస్‌‌ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ పొలిటికల్​ సర్కిల్స్​లో ఉంది. రాబోయే రోజుల్లో బీఆర్​ఎస్​ చేసే రాజకీయాలపై కవిత ఇష్యూ ప్రభావం అత్యంత కీలకంగా ఉంటుందని.. బీఆర్‌‌ఎస్‌‌కు ఒక ఫియర్‌‌ ఫ్యాక్టర్‌‌గా ఈ ఇష్యూ మారుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నుంచి మొదలుకొని.. రాబోయే  ప్రతి రాజకీయ అంశంలోనూ కవిత ఇష్యూ చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి.