భూభారతి స్పెషల్ డ్రైవ్తో సత్ఫలితాలు : కలెక్టర్ రాహుల్ రాజ్

భూభారతి స్పెషల్ డ్రైవ్తో సత్ఫలితాలు : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​టౌన్, వెలుగు: భూభారతి దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన పది రోజుల స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలనిస్తోందని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 22 నుంచి నవంబర్​1 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ  పది రోజుల్లో తహసీల్దార్ల పరిధిలో 183, ఆర్డీవోల పరిధిలో 661, కలెక్టరేట్​లో 168 ఫైల్స్ క్లియర్ చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 1,012 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 2,573 ఫైల్స్ వివిధ స్థాయిలో క్లియర్ చేసినట్లు వివరించారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్​రాజ్​సూచించారు. ఆదివారం నిజాంపేట మండలం  కల్వకుంట్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 18,600 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోవద్దని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. 

రైతులు అప్రమత్తంగా ఉండాలి

రానున్న మూడు రోజుల్లో జిల్లాలో మోస్తారుగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు  రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్​రాజ్​ సూచించారు. ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడాలని, టార్ఫాలిన్లు కప్పాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. 

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం - కలెక్టర్​ ప్రావీణ్య

రామచంద్రాపురం: తెల్లాపూర్​ మున్సిపల్​ పరిధిలోని కొల్లూర్​ డబుల్​ బెడ్రూమ్​ల వద్ద సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్​ ప్రావీణ్య తెలిపారు. ఆదివారం కొల్లూర్​ ఫేజ్​ 2 నివాసాలను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడి నివాసితులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్​ బెడ్రూమ్​ కమ్యూనిటీ వాసుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే హాస్పిటల్, స్కూల్​ నిర్మాణాలు మొదలయ్యాయని త్వరలోనే మిగతా సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. సోమవారం సీఎస్​ఆర్ ఫండ్స్​ ద్వారా నిర్మించే ప్రభుత్వ స్కూల్​ పనులకు శంకుస్థాపన చేయనున్నామని వివరించారు.

 డబుల్​ బెడరూమ్​ల వద్ద నిర్మించిన షాపులను త్వరలోనే కేటాయింపులు చేసి అందుబాటులోకి తీసుకొస్తామని, కొంత సంయమనం పాటించాలని అక్కడి వారికి సూచించారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్​, మెడికల్ శాఖల అధికారులు సమన్వయంతో ఉండాలని, ఎప్పటికప్పుడు డబుల్​ బెడ్రూమ్​ వాసుల సమస్యలపై స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు. శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ శాఖ​అ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, మున్సిపల్​ కమిషనర్​ అజయ్​ కుమార్​ రెడ్డి, ఆర్సీపురం తహసీల్దార్ సరస్వతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

నేడు కొల్లూర్​కు ముగ్గురు మంత్రుల రాక

తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్​లో సోమవారం ముగ్గురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. కొల్లూర్​లోని డబుల్​ బెడ్రూమ్​ నివాసాల వద్ద సీఎస్ఆర్​ నిధులతో నిర్మించనున్న పీహెచ్​సీ, ఉన్నత పాఠశాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, జిల్లా ఇన్​చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక శాఖ, గనులు, ఉపాధి శాఖల మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి శంకుస్థాపన చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కలెక్టర్​ ప్రావీణ్య, గృహ నిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్​ ఆదివారం పర్యవేక్షించారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందని, పోలీసులు, అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.