- రంగంలోకి వీడీసీ, ప్రజా సంఘాలు... దశలవారీగా అన్ని గ్రామాల్లో ఆందోళనలు...
నిర్మల్, వెలుగు: రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న కోతుల బెడదను వెంటనే నివారించాలని పలుచోట్ల ఉద్యమం రూపొందుతోంది. ఈ మేరకు ఖానాపూర్లో మొట్టమొదటిసారిగా నవంబర్ 4వ తేదీన కోతులను నివారించి తమను రక్షించాలని ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే వీడీసీ సభ్యులతో పాటు వివిధ కుల సంఘాలు, డ్వాక్రా సంఘాలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, మజీద్ కమిటీ సభ్యులు, యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఇటీవలే సమావేశమై ఉద్యమ బాటకు రూపకల్పన చేశారు. నవంబర్ 4వ తేదీన ఖానాపూర్ లోని ఐబీ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ చేపట్టేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు.
రోజురోజుకు పెరిగిపోతున్న కోతుల బాధ...
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు కోతుల బెడద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. జనం ఇళ్ల నుండి బయటకు వెళ్లేందుకు సైతం జంకుతున్నారు. గుంపులు గుంపులుగా కోతులు వీధులలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అలాగే ఇప్పటికే వందలాదిమందిపై దాడులు జరిపి గాయాలపాలు చేశాయి. కోతుల దాడితో ప్రతిరోజు దాదాపు 50 నుండి 100 మందికి పైగా గాయాల పాలవుతూ ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. అలాగే పంట పొలాలన్నింటిపై దాడులు జరుపుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి.
కోతుల కోసం రాత్రింబవళ్లు రైతులు కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా గ్రామాలలో ఇప్పటికే కోతుల కాపలా టీంలను సైతం ఏర్పాటు చేసుకొని వాటిని తమ గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ గ్రామాల్లోనే కాకుండా పంట పొలాల పైన, ప్రధాన రహదారుల పైన కోతుల గుంపులు వాహనదారులను సైతం అడ్డుకుంటూ దాడులు జరుపుతున్నాయి. దీంతో జిల్లా వాసులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మంకీ రెస్క్యూ సెంటర్ కూడా ఆశించడం మేర కోతుల నివారణలో ప్రగతి సాధించడం లేదు.
దశల వారీగా గ్రామాలలో ఆందోళన బాట...
కాగా రోజురోజుకు తీవ్రమవుతున్న కోతుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయా గ్రామాలలో దశలవారీగా ఆందోళన బాట చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా గ్రామాలలోని వీడీసీలు ఇక కోతుల బాధను తప్పించేందుకు కోసం ఉద్యమ బాటనే శరణ్యం అంటూ నిర్ణయిస్తున్నాయి. వీడీసీ లతోపాటు గ్రామాల్లోని కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను సైతం ఈ ఆందోళనలో భాగస్వామ్యం చేసేందుకు వీడీసీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఇంటి పెద్దను కోల్పోయారు
ఖానాపూర్ పట్టణం లోని బొంగోని లక్ష్మి (58)అనే మహిళ పై గత ఏడాది అక్టోబర్ 31న కోతులు దాడి చేశాయి. ఇంటి ఆవరణలో పని చేస్తుండగా కోతుల గుంపు ఆమె పై దాడి జరిపాయి. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రి కి తీసుకొని వెళ్లగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు భర్త తో బాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుడున్నాడు.ఈమె మృతి తో ఆ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. అలాగే ప్రతి రోజు నిర్మల్, భైంసా, ఖానాపూర్ ఆసుపత్రులకు వంద మందికి పైగా కోతుల దాడి లో గాయపడిన వారు చికిత్స కోసం వస్తున్నారు.
కాపలా టీమ్ లు
లక్ష్మణ్ చందా, మామడ, సారంగాపూర్, కడెం తదితర మండలాలలోని పలు గ్రామాల్లో ఇళ్ల పై, పంటలపై కోతులు దాడులు చేసి నష్ట పరుస్తున్నాయి. దీంతో గ్రామస్థులు వంతుల వారీగా కోతుల కాపలా టీమ్ లను ఏర్పాటు చేసికొని రాత్రింబవళ్ళు కాపలా కాస్తున్నారు.
