జూబ్లీహిల్స్లో గెలుపు మనదే.. అయినా లైట్ తీస్కోవద్దు.. మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం

జూబ్లీహిల్స్లో గెలుపు మనదే.. అయినా లైట్ తీస్కోవద్దు.. మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
  • ఈ వారమే కీలకం.. జూబ్లీహిల్స్లో ప్రచారాన్ని మరింత స్పీడప్​ చేయండి
  • మంత్రులకు సీఎం రేవంత్​ దిశానిర్దేశం
  • పోల్​ మేనేజ్​మెంట్​లోనూ జాగ్రత్తగా ఉండాలి
  • ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలి
  • బీఆర్​ఎస్​ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
  • బీజేపీ, బీఆర్​ఎస్​ లోపాయికారి ఒప్పందాన్ని ఎండగట్టాలి
  • ఈ నెల 4 నుంచి మళ్లీ నేను ప్రచారంలో పాల్గొంట
  • మైనార్టీలు, మహిళల ఓట్లపై ఫోకస్​ పెట్టాలని సూచన
  • డివిజన్లకు ఇన్​చార్జులుగా ఉన్న మంత్రుల నుంచి 
  • రిపోర్టులు తీసుకున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్​లో గెలిచేది కాంగ్రెస్సేనని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజులు చాలా కీలకమని, మరింత పక్కా ప్లాన్​తో ప్రచారాన్ని ఉధృతం చేయాలని మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్​లోని తన వ్యక్తిగత కార్యాలయంలో సీఎం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు. సీతక్క విదేశీ టూర్​లో ఉండడంతో ఆమె ఒక్కరు మాత్రమే ఈ మీటింగ్​కు రాలేకపోయారు. మంత్రులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రచార బాధ్యతల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్​పర్సన్లు, బూత్ స్థాయిలోని నాయకులు ఇట్ల ప్రతి ఒక్కరూ ఇది తమ ఎన్నిక అని భావించి ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది.

ఇప్పటి వరకు కొనసాగించిన ప్రచారంపై ప్రజల నుంచి వచ్చిన స్పందన, డివిజన్లలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్​పర్సన్ల పనితీరుపై కూడా మంత్రుల ద్వారా సీఎం రేవంత్​రెడ్డి ఆరా తీశారు. వరుసగా రెండు రోజుల పాటు తన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లపై కూడా జనం నుంచి వచ్చిన స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఒక్కో డివిజన్ కు ఇద్దరేసి చొప్పున మంత్రులు ఇన్​చార్జులుగా ఉండడంతో వారి నుంచి విడివిడిగా రిపోర్టులను సీఎం తీసుకున్నారు. రాబోయే వారం రోజుల ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో పేదల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం రేవంత్​ సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలే ఎక్కువగా ఉన్నందున, వారికి  సంబంధించిన పథకాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తున్నందున, వాటిపైన ప్రధానంగా ప్రచారం చేయాలన్నారు. ముఖ్యంగా సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డుల జారీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్​వంటి స్కీమ్​లను ఇంటింటా ప్రచారం చేస్తే సరిపోతుందని దిశానిర్దేశం చేశారు. 

బీఆర్​ఎస్​ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, ప్రజలకు వాస్తవాలు ఏమిటో వివరించాలని సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. సొంత ఆడబిడ్డ విషయంలో కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరును కూడా జనంలోకి  తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. ‘‘మహిళల విషయంలో బీఆర్ఎస్ గత పదేండ్లలో చూపించిన వివక్షను, ఇప్పుడు మహిళల కోసం మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, వారికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా జనానికి చెప్పాలి. 

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఏ విధంగా కుమ్మక్కయ్యాయో..ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని, ఈ విషయాన్ని జూబ్లీహిల్స్​ ఓటర్లకు వివరించాలి” అని ఆయన చెప్పినట్లు తెలిసింది. మైనార్టీల, మహిళల ఓట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలనే దానిపైనా ఈ సమావేశంలో చర్చ సాగింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నదని కూడా సీఎం  రేవంత్ ఆరా తీసినట్లు సమాచారం.  

చాలెంజ్​గా తీసుకోవాలి: మీనాక్షి నటరాజన్​
ప్రచార బాధ్యతల్లో ఉన్న నేతలు రాబోయే వారం రోజులు మంచి సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ సూచించారు. సమిష్టి నిర్ణయంతోనే అభ్యర్థిని ఎంపిక చేశామని, ఈ ఎన్నికను చాలెంజ్ గా తీసుకొని మరింత శ్రమించాలని ఆమె అన్నారు. ఆశించిన ఫలితం వచ్చే వరకు ప్రతి ఒక్కరూ  అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను జనంలోకి  మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు. 

మళ్లీ ప్రచారంలో పాల్గొంట
రాబోయే వారం రోజులు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తేనే అనుకున్న ఫలితం సాధిస్తామని, ఎలాగో గెలుస్తామనే భావన ఎవరిలోనూ రావద్దని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. పోల్ మేనేజ్​మెంట్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. దానిపై కూడా ఇప్పటి నుంచే దృష్టి పెట్టి పార్టీ నేతలను అప్రమత్తం చేయాలని మంత్రులకు తెలిపారు. ఈ నెల 4 నుంచి మళ్లీ తన ప్రచారం ఉంటుందని, చివరి రెండు రోజులు కూడా ప్రచారంలో పాల్గొంటానని మంత్రులతో  సీఎం రేవంత్ చెప్పారు.