- ఐటీఆర్‌లో వెల్లడించకపోతే నోటీసులు
- పెద్ద ట్రాన్సాక్షన్లపై ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు బ్యాంక్ రిపోర్ట్
- మ్యూచువల్ ఫండ్ డివిడెండ్లు, ఎఫ్‌డీల వడ్డీలు ఐటీఆర్‌లో దాస్తే అంతే
న్యూఢిల్లీ: ప్రతీ నెల బిల్లులు, ఈఎంఐల చెల్లింపు, డబ్బు పంపడం/పొందడం వంటివి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ల నుంచి చేస్తుంటాం. కానీ, కొన్ని రకాల ట్రాన్సాక్షన్లు ఇన్‌కమ్ ట్యాక్ డిపార్ట్‌మెంట్ (ఐటీడీ) దృష్టికి పోతాయని గుర్తుపెట్టుకోవాలి. ఐటీడీ ఈ రకమైన రోజువారీ లావాదేవీలపై కూడా నిఘా పెడుతోంది. పెద్ద వ్యాపారులు, ధనవంతులు మాత్రమే కాదు, సాధారణ బ్యాంక్ ఖాతాదారుల లావాదేవీలను కూడా తన డేటా మానిటరింగ్ సిస్టమ్ ద్వారా గమనిస్తోంది.
అంతేకాకుండా పోస్ట్‌ఆఫీసులు, స్టాక్ బ్రోకర్లు, బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు కూడా అనుమానస్పద ట్రాన్సాక్షన్లపై ఐటీ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేస్తాయి. స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్‌ఎఫ్‌టీ) ద్వారా అధిక విలువ గల లావాదేవీలను ఐటీడీ గుర్తిస్తోంది. పన్ను ఎగవేతను అడ్డుకోవడంలో ఈ డేటా మానిటరింగ్ సిస్టమ్ సాయపడుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) అనుమానాస్పదంగా ఎక్కువ మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేస్తే లేదా తరచుగా క్యాష్ ట్రాన్సాక్షన్లు చేస్తే, మీ బ్యాంక్ ఖాతా ఐటీ శాఖ దృష్టిలో పడొచ్చు.
వీటిపై ఐటీ దృష్టి..
రూ.10 లక్షలకుపైగా క్యాష్ డిపాజిట్
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10 లక్షలకుపైగా క్యాష్ డిపాజిట్ జరిగితే, ఈ వివరాలను బ్యాంక్ ఆటోమెటిక్‌గా ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తుంది. ఇది ఒక్కసారిగా అయినా, విడివిడిగా అయినా, పన్ను రిటర్న్‌లో చూపించకపోతే నోటీసు వచ్చే అవకాశం ఉంది
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారీ చెల్లింపులు
ఆదాయాల కంటే ఎక్కువగా ఖర్చులు ఉంటే, ఐటీ శాఖకు అనుమానం వస్తుంది. ఉదాహరణకు, రూ.6 లక్షల ఆదాయంతో నెలకు రూ.1 లక్షకు పైగా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తే, మీ నిజమైన ఆదాయం ఎక్కువగా ఉందని భావించొచ్చు.
పెద్ద మొత్తంలో క్యాష్ డిపాజిట్/విత్‌డ్రాయల్
చాలా మంది తరచూ పెద్ద మొత్తంలో క్యాష్ డిపాజిట్ లేదా విత్‌డ్రా చేస్తుంటారు. ముఖ్యంగా వ్యాపారం, వివాహం వంటి వాటి కోసం ఇటువంటి ట్రాన్సాక్షన్లు జరుగుతుంటాయి. ఇది లీగలే అయినప్పటికీ, తరచూ క్యాష్ ట్రాన్సాక్షన్లు చేస్తే, స్పష్టమైన కారణం లేకపోతే మీ అకౌంట్ ‘అనుమానస్పదం’గా ఉందని ఐటీ శాఖకు బ్యాంక్ రిపోర్ట్ చేస్తుంది.
రూ.30 లక్షలకుపైగా ప్రాపర్టీ కొనుగోలు/అమ్మకం
ఈ రకమైన ట్రాన్సాక్షన్లు ఆటోమేటిక్‌గా ఐటీ శాఖకు చేరతాయి. అకౌంట్‌లో పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ లేదా విత్‌డ్రా ట్రాన్సాక్షన్లు జరిగి ఉంటే, అది ప్రాపర్టీకి సంబంధించినదేనా అని విచారణ జరుగుతుంది.
విదేశీ ప్రయాణాల ఖర్చులు
ఒక ఏడాదిలో విదేశీ ప్రయాణాలు, విద్య, ఫారెక్స్ కార్డులు వంటి వాటి కోసం చేసే అంతర్జాతీయ ఖర్చులు రూ.10 లక్షలకుపైగా ఉంటే, ఐటీ శాఖ ఆ డబ్బు లీగల్ మార్గాల్లో వచ్చిందేనా అని చూస్తుంది. ఐటీఆర్‌లో పేర్కొన్న ఆదాయాలకు అనుగుణంగా విదేశీ ఖర్చులు ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
డార్మెంట్ అకౌంట్‌లో పెద్ద యాక్టివిటీ
చాలా కాలంగా ఉపయోగించని అకౌంట్‌లో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్/ట్రాన్స్‌ఫర్ అయితే, బ్యాంక్ అనుమానించి ఐటీ శాఖకు సమాచారం ఇస్తుంది.
బ్యాంక్ అకౌంట్‌లో వచ్చిన వడ్డీ/డివిడెండ్‌ను ఐటీఆర్‌లో చూపించకపోవడం
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ నుంచి వచ్చిన డివిడెండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీలు ఐటీ రిటర్న్‌లలో చూపించకపోతే, ఆటోమెటిక్ మ్యాచింగ్ సిస్టమ్ ద్వారా ఐటీ శాఖ గుర్తిస్తుంది. బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చేవి, బయటకు వెళ్లే ఫండ్స్ వివరాలను ఈ సిస్టమ్ ట్రాక్ చేస్తుంది.
ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు..
చాలా మంది మూడు లేదా నాలుగు బ్యాంక్ అకౌంట్లు నిర్వహిస్తారు. కానీ వాటి వడ్డీ ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించరు. పాన్, ఆధార్ లింకింగ్ వలన ఈ డేటా ఐటీ శాఖకు చేరుతోందని గుర్తుంచుకోవాలి.
స్పష్టతలేని డబ్బు డిపాజిట్లు
“ఫ్రెండ్ ఇచ్చాడు”, “ఇంట్లో సేవింగ్స్”, “గిఫ్ట్” అనే పేర్లతో పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేస్తే, దీనిని సపోర్ట్ చేసే డాక్యుమెంట్లు లేకపోతే, అది గుర్తు తెలియని ఆదాయంగా పరిగణిస్తారు.
ఇతరుల కోసం ట్రాన్సాక్షన్లు
మీ అకౌంట్‌ను మూడో వ్యక్తి ఉపయోగిస్తే, అంటే మీరు పెద్ద మొత్తంలో డబ్బు పంపడం, ఇతరుల పేరిట డబ్బు రావడం జరిగితే, వీటిని బినామి ట్రాన్సాక్షన్లుగా ఐటీ శాఖ పరిగణించే అవకాశం ఉంటుంది.
