ఇవాళ్టి ( నవంబర్ 3 ) నుంచి కాలేజీల బంద్.. ఫీజు బకాయిలు చెల్లించేదాకా తెరవబోమంటున్న మేనేజ్ మెంట్లు

ఇవాళ్టి ( నవంబర్ 3 ) నుంచి కాలేజీల బంద్.. ఫీజు బకాయిలు చెల్లించేదాకా తెరవబోమంటున్న మేనేజ్ మెంట్లు

హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను సర్కారు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి ప్రైవేటు కాలేజీలు నిరవధిక బంద్​ చేపడుతున్నాయని ప్రైవేటు విద్యా సంస్థల మేనేజ్ మెంట్ల సంఘం (ఫతీ) ప్రకటించింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ,ఎంసీఏ, బీఈడీ.. ఇలా అన్ని రకాల  కాలేజీలనూ మూసివేస్తున్నామని వెల్లడించింది. ఫీజు బకాయిలు చెల్లించే  వరకూ కాలేజీలు తెరవబోమని పేర్కొంది. 

నాలుగేండ్లుగా రూ.9 వేల కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని.. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ఫతీ నేతలు డిమాండ్  చేశారు. ఏండ్లుగా ఫీజు బకాయిలు రిలీజ్  కాకపోవడంతో కాలేజీలను నిర్వహించే పరిస్థితి లేదని, సిబ్బందికి జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నామని వాపోయారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఈ నెల 3 నుంచి కాలేజీల బంద్​కు పిలుపునిచ్చామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 

ఈ నెల 6న లక్షన్నర మంది సిబ్బందితో హైదరాబాద్​లో సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఫీజు బకాయిలు ఇవ్వమంటే తమను భయపెట్టేందుకు విజిలెన్స్  దాడులు చేయడం దారుణమన్నారు. అయినా.. వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.