రాష్ట్రంలో మోదీ పర్యటన నాలుగున్నర గంటలు..షెడ్యూల్ రిలీజ్ చేసిన పీఎంఓ

రాష్ట్రంలో మోదీ పర్యటన నాలుగున్నర గంటలు..షెడ్యూల్ రిలీజ్ చేసిన పీఎంఓ
  • 10వ తేదీన 2:20కి రాక..6:45కి తిరుగు ప్రయాణం

హైదరాబాద్, వెలుగు:  ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన (ఆదివారం) హైదరాబాద్‌‌లో పర్యటించనున్నారు. మొత్తం 4 గంటల 25 నిమిషాల పాటు సాగనున్న ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు రాజకీయ బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. ప్రధాని షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం 1:10 గంటలకు ప్రత్యేక విమానంలో  బెంగళూరు నుంచి బయలుదేరి, 2:20 గంటలకు బేగంపేట ఎయిర్‌‌పోర్ట్‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

అనంతరం 3:45 నుంచి 4:15 గంటల వరకు హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సభ అనంతరం సాయంత్రం 6:45 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌‌లోని జామ్‌‌నగర్‌‌కు తిరిగి వెళ్లిపోతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగరం అంతటా భారీ భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా, పర్యటన సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.