
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. బ్రిటన్, మాల్దీవుల్లో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయనున్నారు. అలాగే, ఇండియా, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపనున్నారు. ఈమేరకు ఆదివారం విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదట బుధవారం మోదీ బ్రిటన్ వెళ్లనున్నారు. అక్కడ రెండ్రోజుల పర్యటన ముగించుకొని, మాల్దీవులు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొంటారు.
ఈ నెల 23, 24 తేదీల్లో బ్రిటన్‌లో పర్యటించనున్న మోదీ.. ఆ దేశ ప్రధాని కిర్ స్టార్మర్‌తో విస్తృత స్థాయి చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిఫెన్స్, సెక్యూరిటీ, క్లైమెట్, హెల్త్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై వీరు చర్చించనున్నట్లు వెల్లడించింది. ఫ్రీ ట్రేడ్ డీల్‌పై ఇరు దేశాల నేతలు చర్చించనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే ఇండియా ఎగుమతులకు 99 శాతం బెనిఫిట్ ఉండనుంది.