
- ప్రధాని మోదీ హెచ్చరిక.. తాజా పరిస్థితిపై హైలెవల్ డిఫెన్స్ మీటింగ్
- ఆపరేషన్ సిందూర్ ఇంతటితో ముగిసిపోలేదు
- పాక్ మళ్లీ దాడి చేస్తే అంతకు రెట్టింపు మూల్యం తప్పదు
- సింధూ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుంది
- కాశ్మీర్‌పై ఎవరి మధ్యవర్తిత్వమూ అక్కర్లేదని వెల్లడి
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్‌తో ఫోన్లో సంభాషణ
- పీవోకేను పాక్ తిరిగివ్వడంపై తప్ప దేనిపైనా చర్చల్లేవని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మళ్లీ భారత్‌పై దాడికి పాల్పడితే తడాఖా చూపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అక్కడి నుంచి తుపాకీ తూటా పేలితే.. ఇక్కడి నుంచి మిసైల్ పైకి లేస్తుందన్నారు. ఇది న్యూ ఇండియా అని, ఎప్పట్లాగే వ్యవహరిస్తామంటే కుదరదని తేల్చిచెప్పారు. కాశ్మీర్ అంశంపై ఎవరి మధ్యవర్తిత్వాన్నీ అంగీకరించబోమని, పీవోకేను తిరిగి భారత్ కు అప్పగించడంపై తప్ప మిగతా ఏ విషయంలోనూ పాక్ తో చర్చలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ ఇంతటితో ముగిసిపోలేదని, ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు కొనసాగుతుందని చెప్పారు. శనివారం కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటలకే పాక్ మళ్లీ ఫైరింగ్, డ్రోన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోదీ హైలెవల్ డిఫెన్స్ మీటింగ్ నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠితో తాజా పరిస్థితిపై ప్రధాని చర్చించారు. పాకిస్తాన్ మళ్లీ దాడి చేస్తే మరింత తీవ్ర స్థాయిలో బుద్ధిచెప్పాలని సాయుధ బలగాలను ఆయన ఆదేశించారు. ఆ దేశం చేసే ప్రతి దాడికీ మన ప్రతిస్పందన అత్యంత తీవ్రంగా ఉండాలని స్పష్టం చేశారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఘర్ మే ఘుస్ కే మారేంగే..
ఇండియా ఇప్పుడు ‘ఘర్ మే ఘుస్ కే మారేంగే’ అనే కొత్త విధానాన్ని అనుసరిస్తోందని, పాక్ గడ్డపైనే టెర్రరిస్టులను అంతం చేస్తోందని మోదీ అన్నారు. ‘‘తుపాకీ తూటాలకు ఫిరంగి గుళ్లతో జవాబు చెప్పండి(వహా సే గోలీ చలేగీ, తో యహా సే గోలా చలేగా)” అని ఆయన ఆర్మీకి దిశానిర్దేశం చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ఇంతటితో ముగిసిపోలేదు. ఇప్పటివరకు మర్కజ్ ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కలిపేశాం. ఇకపై మిగతా టెర్రర్ క్యాంపులనూ నేలమట్టం చేస్తాం. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నందుకు పాక్ మరింత మూల్యం చెల్లించుకోవాలి” అని ప్రధాని తేల్చిచెప్పారు. కాశ్మీర్ అంశంలో భారత్ ఎప్పటికీ ఎవరి మధ్యవర్తిత్వాన్నీ సహించబోదని, కేవలం పీవోకేను పాక్ తిరిగి అప్పగించడంపై మాత్రమే చర్చించాల్సి ఉందని స్పష్టం చేశారు.
మోదీకి జేడీ వాన్స్ ఫోన్
పాకిస్తాన్ మళ్లీ భారత్ పై దాడి చేస్తే తమ ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా, మరింత విధ్వంసపూరితంగా ఉంటుందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కు కూడా ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. జేడీ వాన్స్ ఈ మేరకు మోదీతో ఫోన్ లో మాట్లాడారని ఆదివారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘మేం మునుపటిలా లేం. పూర్తిగా మారిపోయాం. దీనిని పాకిస్తాన్ తోపాటు యావత్తు ప్రపంచం గుర్తించాలి. ఇప్పుడు ఇండియాతో ఎప్పటిలాగే వ్యవహరిస్తామంటే కుదరదు” అని స్పష్టం చేసినట్టు తెలిపాయి.
పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించనంత వరకు మాత్రమే భారత్ సంయమనం పాటిస్తుందని చెప్పారని పేర్కొన్నాయి. అలాగే పాక్ తో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని.. పీవోకేను తిరిగి ఇండియాకు అప్పగించడంపై మాత్రమే చర్చిస్తామని చెప్పారని పేర్కొన్నాయి. ఉద్రిక్తతల తగ్గింపుపై ఎన్ఎస్ఏ, విదేశాంగ మంత్రి స్థాయిలో కూడా ఎలాంటి చర్చలు ఉండబోవని, కేవలం రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే డిస్కషన్స్ ఉంటాయని మోదీ తేల్చిచెప్పారని వివరించాయి.
ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్స్
పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఆదేశించారు. పశ్చిమ సరిహద్దుల్లో ఎలాంటి ప్రతిదాడులనైనా చేపట్టేందుకు ఆర్మీ కమాండర్లందరికీ ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చారని ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘‘శనివారం రాత్రి పాక్ కాల్పుల విరమణ తర్వాత తాజా పరిస్థితిపై వెస్ట్రన్ బార్డర్స్ ఆర్మీ కమాండర్లతో ఆర్మీ చీఫ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాక్ బలగాలు మళ్లీ సీజ్ ఫైర్ ను ఉల్లంఘిస్తే.. తక్షణమే తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు చేయాలని ఆదేశించారు. ఈ
విషయంలో కమాండర్లందరికీ ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టు వెల్లడించారు” అని ఆర్మీ పేర్కొంది.
పాక్ ఎయిర్ బేస్ పేల్చివేత
పాకిస్తాన్‌కు కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని భారత్ మే 10న దాడులు చేసింది. దీంతో పాక్‌కు భారీ నష్టం వాటిల్లింది. అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను త్రివిధ దళాల అధికారులు విడుదల చేశారు. రావల్పిండి చక్లాలాలో ఉన్న కీలకమైన ఎయిర్ బేస్ స్టేషన్ నూర్ ఖాన్. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు 10కిమీ దూరంలో ఉంది. పాక్ రవాణా స్క్వాడ్రన్లకు ఇది నిలయం. లాజిస్టికల్, వ్యూహాత్మక ఎయిర్ లిఫ్ట్ కార్యకలాపాలకు దీన్ని ఉపయోగిస్తారు.
ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్స్
పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఆదేశించారు. పశ్చిమ సరిహద్దుల్లో ఎలాంటి ప్రతిదాడులనైనా చేపట్టేందుకు ఆర్మీ కమాండర్లందరికీ ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చారని ఇండియన్ ఆర్మీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘‘శనివారం రాత్రి పాక్ కాల్పుల విరమణ తర్వాత తాజా పరిస్థితిపై వెస్ట్రన్ బార్డర్స్ ఆర్మీ కమాండర్లతో ఆర్మీ చీఫ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాక్ బలగాలు మళ్లీ సీజ్ ఫైర్ ను ఉల్లంఘిస్తే.. తక్షణమే తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో కమాండర్లందరికీ ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టు వెల్లడించారు” అని ఆర్మీ పేర్కొంది.
ఎక్కడ దాక్కున్నా వదలం..
పాక్ అణుబాంబుల బుకాయింపులు వట్టివేనని ఆపరేషన్ సిందూర్ తో తేలిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. అసలు ఏ దశలోనూ అణుబాంబులు ప్రయోగించుకునే స్థాయికి పాక్ పోరాటం చేయలేదన్నారు. అణ్వస్త్రాల ముప్పును సీరియస్‌గా తీసుకుంటున్నామని, కానీ ఈ సాకుతో టెర్రరిజాన్ని వ్యాప్తి చేసే ఆటలు ఇక సాగనివ్వబోమన్నారు. ‘‘ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇండియా ఇప్పుడు ‘ఘర్ మే ఘుస్ కే మారేంగే(ఇంట్లో దూరి చంపేస్తాం)’ అనే కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. పాక్ గడ్డపైనే టెర్రరిస్టులను అంతం చేస్తోంది. ఎల్ఓసీ, ఇంటర్నేషనల్ బార్డర్ లేదా అణ్వస్త్రాలు మిమ్మల్ని (టెర్రరిస్టులను) రక్షించలేవు. పాకిస్తాన్ లో మీరు ఎక్కడ నక్కినా సరే దాడి చేస్తాం. ఇప్పుడు మేం పదాతి దళాలపై కాదు.. పాక్ పాము పడగపైనే దాడి చేశాం” అని ప్రధాని హెచ్చరించారు.
టార్గెట్లు పూర్తి చేశాం: ఐఏఎఫ్
పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా నిర్దేశించిన అన్ని టాస్క్ లనూ విజయవంతంగా పూర్తి చేశామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఆదివారం ప్రకటించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ టెర్రరిస్టులు 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న తర్వాత.. పాకిస్తాన్, పీవోకే లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టేందు కు మే 7వ తేదీన భారత్ ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది.
శనివారం కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. దీంతో ఆదివారం ఐఏఎఫ్ ఈ మేరకు ట్వీట్ చేసింది. ఆపరేషన్ సిందూర్ లో నిర్ణయించుకున్న టార్గెట్లు అన్నింటినీ విజయవంతంగా ధ్వంసం చేశామని, ఇకపై కూడా దేనికైనా సిద్ధమని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ ఇకపైనా కొనసాగుతుందని, తదుపరి పరిణామాలను బట్టి మీడియాకు ప్రకటనలు ఉంటాయని పేర్కొంది.