బెస్ట్ లీడర్ మోడీ..దేశంలో 65 శాతం మంది పీఎం వైపే

బెస్ట్ లీడర్ మోడీ..దేశంలో 65 శాతం  మంది పీఎం వైపే
  • సీ ఓటర్‌‌ ‘స్టేట్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడి
  • ఏపీలో 83.6 శాతం.. తెలంగాణలో 71% మద్దతు
  • ముఖ్యమంత్రుల్లో బెస్ట్‌‌ నవీన్‌‌ పట్నాయక్‌‌
  • నాలుగో ప్లేస్‌‌లో జగన్‌‌.. టాప్‌‌ 5లో లేని కేసీఆర్‌‌

న్యూఢిల్లీప్రధాని నరేంద్ర మోడీ పాలన బాగుందని దేశ జనం చెబుతున్నరు. ఆయన లీడర్‌‌షిప్‌‌పై తమకు భరోసా ఉందంటున్నరు. దేశవ్యాప్తంగా 65.69 శాతం మంది మోడీనే బెస్ట్‌‌ లీడరని ఓటేశారు. ఆయన రెండోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకొని ఏడాదైన సందర్భంగా  ‘స్టేట్ ఆఫ్ ది నేషన్ 2020’ పేరుతో  సీ ఓటర్‌‌ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వే కోసం దేశంలోని ప్రతి రాష్ట్రంలో 3 వేల మందికి పైగా జనాల అభిప్రాయాలు తీసుకున్నరు. ప్రధానితో పాటు సీఎంల ప్రజాదరణపైనా సర్వే చేసి రిపోర్టు విడుదల చేశారు. దేశంలో నవీన్‌‌ పట్నాయక్‌‌ బెస్ట్‌‌ సీఎంగా నిలిచారు.

మూడు రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా జనం మోడీని సపోర్ట్‌‌ చేశారని సర్వే వెల్లడించింది. అత్యధికంగా ఒడిశాలో 95.6 శాతం మంది మోడీ వైపు నిలిచారంది. హిమాచల్‌‌ లో 93.95 శాతం, చత్తీస్‌‌గఢ్‌‌లో 92.73% మద్దతిచ్చారని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 83.6%, తెలంగాణలో 71.51 శాతం మంది మోడీకి జైకొట్టారని తెలిపింది. తమిళనాడులో 32.15 శాతమే పీఎం పనితీరు బాగుందన్నారని చెప్పింది. కేరళలో 32.89%, జమ్మూకాశ్మీర్‌‌లో 50.23%, ఢిల్లీలో 60.35%, బెంగాల్‌‌లో 64.06 శాతం మోడీ పనితీరుకు జై కొట్టారని తెలిపింది.

‘పాపులర్‌‌’ పట్నాయక్‌‌

దేశంలోని సీఎంలలో ఒడిశా సీఎం నవీన్‌‌ పట్నాయక్‌‌ టాప్‌‌లో ఉన్నారని సర్వేలో తేలింది. ఆయనకు 82.96 శాతం మంది ప్రజలు మద్దతిచ్చారని వెల్లడించింది. చత్తీస్‌‌గఢ్‌‌ సీఎం భూపేష్ భగల్ 81.06 శాతంతో రెండో స్థానంలో, కేరళ సీఎం పినరయి విజయన్‌‌ మూడో స్థానంలో (80.28 శాతం) ఉన్నారని చెప్పింది. ఏపీ సీఎం జగన్‌‌ నాలుగో స్థానంలో (78.01), మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌ ఠాక్రే ఐదో ప్లేస్‌‌లో ఉన్నారంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు 54.22 శాతమే మద్దతిచ్చారని చెప్పింది. హర్యానా సీఎం ఖట్టర్‌‌కు అతి తక్కువగా 4.47 శాతమే మద్దతిచ్చారని తెలిపింది. తర్వాత ప్లేస్‌‌లో ఉత్తరాఖండ్‌‌ సీఎం రావత్‌‌ (17.72), పంజాబ్‌‌ సీఎం అమరీందర్‌‌ (27.51), బీహార్‌‌ సీఎం నితీశ్‌‌ (30.84), తమిళనాడు సీఎం పళనిస్వామి (41.28) ఉన్నారని చెప్పింది.

ప్రధానిగా ఓటు మోడీకే

ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారని కూడా సీ ఓటర్‌‌ సర్వే చేసింది. ఇందులో 66.2 శాతం మంది మోడీకి మార్కులేయగా కాంగ్రెస్‌‌ నేత రాహుల్‌‌ గాంధీకి 23.21 శాతం మంది ఓటేశారని సర్వే వెల్లడించింది. దేశంలోని పది రాష్ట్రాల్లో మోడీనే బెస్ట్‌‌ అంటూ ప్రజలు మద్దతిచ్చారని, మూడు రాష్ట్రాల్లో మాత్రం మోడీ కంటే ఎక్కువగా రాహుల్‌‌కు ఓట్లు పడ్డాయని సర్వే చెప్పింది. కేరళ, గోవా, తమిళనాడుల్లో జనం రాహుల్‌‌ వైపు నిలిచారంది.

అమెరికాలో గొడవలు ఆగట్లే