మోడీ వెళ్లే దారంతా గులాబీ పూలే

మోడీ వెళ్లే దారంతా గులాబీ పూలే

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ఆయన ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా కాశి ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. దారి పొడువున మోడీ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు. దీంతో ప్రధాని వెళ్లే దారంతా గులాబీ పూలతో నిండిపోయింది. అయితే మోడీ కాన్వాయ్ వస్తుండగా ఓ వ్యక్తి ఆయనకు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కాషాయి వస్త్రాల్లో వచ్చిన వ్యక్తి తెచ్చిన కానుకను మోదీ కారు డోర్ ఓపెన్ చేసి స్వీకరించారు. అక్కడ ఉన్న ప్రజలకు ఆయన అభివాదం చేశారు. 

భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మోడీ అతనికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన తెచ్చిన కానుకలను తనకు అందించాలని వారికి చెప్పారు. అక్కడే కారు ఆపించి, ఆ వ్యక్తి తెచ్చిన తలపాగా, కాషాయ వస్త్రాన్ని స్వీకరించారు. భద్రతా వలయం లోపలికి వచ్చి ఆ వ్యక్తే స్వయంగా వాటిని ప్రధానికి అందించారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత బండి సంజయ్ షేర్ చేశారు. మోడీ డౌన్ టు ఎర్త్ లీడర్ అని కొనియాడారు. నరేంద్ర మోదీ కాశీ ప్రజలచే ఘన స్వాగతం అందుకున్నారని ట్విట్టర్ లో బండి ట్వీట్ చేశారు. 

అంతకుముందు వారణాసి చేరుకున్న ప్రధానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. కాల భైరవ ఆలయానికి చేరుకొని ప్రధాని పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో కాశీ వీధుల వెంబడి వెళ్తున్న ఆయనపై అక్కడి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పూలు చల్లుతూ, కరతాళ ధ్వనులు చేస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం కాషాయ వస్త్రాలు ధరించిన మోడీ గంగా నదిలో పవిత్ర స్నానమాచరించారు.