దేశ అభివృద్ధి కోసం బీజేపీ తనను తాను అంకితం చేసుకోవాలి: మోడీ

దేశ అభివృద్ధి కోసం బీజేపీ తనను తాను అంకితం చేసుకోవాలి: మోడీ
  • అందరికీ దగ్గరవుదాం
  • బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ పిలుపు
  • అమృత కాలాన్ని.. కర్తవ్య కాలంగా మార్చుకోవాలి
  • లోక్‌సభ ఎన్నికలకు 400 రోజులే ఉన్నయ్
  • నేతలు పూర్తి అంకితభావంతో పని చేయాలి
  • పార్టీని విస్తరించి, దేశాన్ని నడిపించాలి
  • బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పీఎం పిలుపు

న్యూఢిల్లీ: మైనారిటీలతో సహా సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ కావాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేయాలని కోరారు. ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో మంగళవారం ప్రధాని ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. సమావేశంలో మోడీ మాట్లాడిన విషయాలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితర నేతలు మీడియాకు వెల్లడించారు. ‘‘ఇండియా అత్యుత్తమ శకం రాబోతున్నది. దేశ అభివృద్ధి కోసం పార్టీ తనను తాను అంకితం చేసుకోవాలి. అమృత కాలాన్ని.. కర్తవ్య కాలంగా మార్చుకోవాలి’’ అని పార్టీ కార్యకర్తలకు ప్రధాని హితబోధ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సుమారుగా 400 రోజులే ఉన్నాయని.. నేతలు ప్రతి వర్గానికి పూర్తి అంకితభావంతో సేవ చేయాలని చెప్పారు. పార్టీని విస్తరించి, దేశాన్ని ప్రతి అంశంలో నడిపించాలని అన్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులను కలవాలని, వారితో కనెక్ట్ కావడానికి యూనివర్సిటీలు, ఇతర ప్రదేశాలను సందర్శించాలని కోరారు.

ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని పార్టీ నేతలను ప్రధాని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధి అజెండాను దెబ్బతీసేలా.. సినిమాల వంటి అసంబద్ధమైన విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కార్యకర్తలకు సూచించారు. ‘‘బీజేపీ ఇకపై కేవలం పొలిటికల్ మూవ్‌మెంట్ మాత్రమే కాదు.. సోషల్ మూమెంట్ కూడా. ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులను మార్చడానికి కృషి చేస్తున్నది” అని చెప్పారు.

యువతకు బీజేపీ సుపరిపాలన తెలియాలి

ఇండియా పొలిటికల్ హిస్టరీని 18 నుంచి 25 ఏండ్ల యువత చూడలేదని, గత ప్రభుత్వాల అవినీతి, అవకతవకలు వారికి తెలియవని ప్రధాని అన్నారు. వాటిపై వారికి అవగాహన కల్పించాలని, బీజేపీ సుపరిపాలన గురించి తెలియజేయాలని సూచించారు. ప్రజలతో మమేకమయ్యేందుకు పార్టీలోని వివిధ మోర్చాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  బార్డర్ గ్రామాల్లో ప్రోగ్రామ్స్ చేపట్టాలని, ప్రభుత్వ అభివృద్ధి స్కీంలు వారికి చేరుతాయని భరోసా కల్పించాలని కోరారు. బేటీ బచావో కార్యక్రమం మాదిరే.. ధర్తి (భూ మి) బచావో ప్రోగ్రాం షురూ చేయాలని సూచిం చారు. ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరారు. కాశీ తమిళ్ సంగం గురించి ప్రస్తావించిన ప్రధాని.. వివిధ సంస్కృతులతో కనెక్ట్ కావాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.