ఆదివాసీ స్వాతంత్ర్య పోరాట యోధులకు చరిత్రలో సరైన స్థానం దక్కలె

ఆదివాసీ స్వాతంత్ర్య పోరాట యోధులకు చరిత్రలో సరైన స్థానం దక్కలె

న్యూఢిల్లీ: సర్దార్ ఉద్ధమ్‌ సింగ్, భగత్ సింగ్ లాంటి వీరులు మన దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసే శక్తిని, ధైర్యాన్ని ఇచ్చిన చోటు జలియన్‌వాలా బాగ్‌ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌‌లో జలియన్‌వాలా బాగ్‌ మెమోరియల్ ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో ప్రధాని మోడీ దానిని ఇవాళ (శనివారం) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలియన్‌వాలా బాగ్‌ లాగే దేశ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఇతర స్మారక చిహ్నాలు, కేంద్రాల రెనోవేషన్‌ పనులు చేపడుతున్నామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో దేశంలోనే తొలి ఇంటరాక్టివ్‌ గ్యాలరీని చంద్రశేఖర్ ఆజాద్ స్మారకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో ఆదివాసీ యోధులు ఉన్నారని, కానీ వాళ్ల పోరాటాలకు చరిత్ర పుస్తకాల్లో సరైన స్థానం దక్కలేదని ప్రధాని మోడీ అన్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ యోధులకు సంబంధించిన పోరాటాలను కళ్లకు కట్టేలా మ్యూజియాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని చెప్పారు. రెనోవేటెడ్‌ జలియన్‌వాలా బాగ్‌ మెమోరియల్ జాతికి అంకితం చేసే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌‌ సింగ్‌ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.